1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 మే 2020 (21:21 IST)

అక్కడ పండిన కూరగాయలు వాడొద్దు: నిపుణుల బృందం నివేదిక

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో స్టైరీన్‌ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం తన సిఫార్సుల్లో పేర్కొంది.

సమీప ప్రాంతంలో పండిన కూరగాయలు, పండ్లను కూడా వినియోగించొద్దని ప్రజలకు సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్‌ఐఆర్‌- ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణుల బృందం ఓ నివేదిక రూపొందించింది.

సంబంధిత నివేదికను కేంద్రానికి పంపించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం పరిశ్రమ సమీపంలోని రహదారులు, ఇళ్లలో స్టైరీన్‌ అవశేషాలు గుర్తించింది. ఒక నివాసంలో అత్యధికంగా 1.7 పీపీఎం స్టైరీన్‌ను గుర్తించినట్లు తన నివేదికలో ఈ బృందం ప్రస్తావించింది.

నివాసాలు పూర్తిగా శుభ్రపరిచాకే తిరిగి వెళ్లాలని నిపుణుల బృందం సూచించింది. 5 గ్రామాలు, 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదంది. ఇదే పరిధిలో గ్రాసాన్ని కూడా పశువులకు అందించవద్దని నిపుణుల బృందం సూచించింది.

విషవాయువు ప్రభావం పడిన మొక్కలను జీవీఎంసీ ద్వారా తొలగించాలంది. తదుపరి నివేదిక వచ్చే వరకు స్థానిక పాల ఉత్పత్తులను వినియోగించరాదని సిఫార్సు చేసింది.

తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని, ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపరచాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలను సైతం శుభ్రపరిచాకే వాడాలని తన సిఫార్సుల్లో పేర్కొంది.