శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:21 IST)

మీ సంగతి త్వరలోనే తేలుస్తాం.. కేటీఆర్ కు బీజేపీ నేత హెచ్చరిక

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. కేటీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. హెచ్చరికలకు పోవద్దని త్వరలోనే మెక్కింది అంతా కక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మిషన్ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారిపోయిందంటూ ఆరోపించారు. రూ.30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్ జేబులు నింపేందుకే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని తెలిపారు. కేసీఆర్ 6శాతం కమీషన్ల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. 
 
ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలకు నోచుకోలేదంటూ మండిపడ్డారు. రైతు రుణమాఫీ పత్తాలేదంటూ విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు రుణమాఫీ వంటి పథకాలు పూర్తిగా పడకేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ ధ్వజమెత్తారు. 
 
తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆగిపోయిందని నాలుగు రోజులుగా సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భవ పథకం గొప్పదేం కాదంటూ వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలని నిలదీశారు. 
 
10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేటువంటి ఆయుస్మాన్ భవను అడ్డుకున్నారంటూ ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయలో గతంలో చేసిన 50 శాతం పనులు మళ్లీ చేశారని ఆరోపించారు. కాగ్ నివేదిక సైతం దాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గతంలో చేసిన 50 శాతం పనులు మళ్లీ చేశారని పేర్కొందని గుర్తు చేశారు. 
 
మిషన్ కాకతీయ పేరుతో ప్రజాధనాన్ని దోచుకుతిన్నారంటూ విరుచుకుపడ్డారు. 25శాతం తక్కువగా వేసిన కాంట్రాక్టర్లకు 45శాతం ఎక్కువగా బిల్లులు ఎలా మంజూరు చేస్తారంటూ నిలదీశారు. 6శాతం కమీషన్లలో భాగంగానే బిల్లులు మంజూరు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీపీఆర్ లేకుండా మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు ఎందుకు టెండర్లకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. 
 
ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అవినీతి ప్రభావంపై సర్వే చేస్తే ఆ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో ఉందన్నది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. 73 శాతం ప్రజలు లంచాలు ఇచ్చి పనులు చేసుకుంటున్నారని సర్వేలో తేలడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని నిలదీశారు.  
 
టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా మారిపోయిందంటూ విరుచుకుపడ్డారు. నల్లధనంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందిందని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు 2 శాతం కమిషన్లు తీసుకుంటే తప్పులేదని వచ్చిన విషయాలను గుర్తు చేశారు.  
 
సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ 2శాతం కమీషన్లను బయటపెట్టింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. ఆ చైర్మన్ ను సస్పెండ్ చేయడం ఆ తర్వాత మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకోవడంపై మండిపడ్డారు.  
 
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ హెచ్చరికలకు పోవద్దని హితవు పలికారు. హెచ్చరికలకు పోతే మెక్కింది అంతా కక్కించేందుకు కేంద్రంలో ఉన్నది మోదీ, అమిత్ షా ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.  టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధాల పుట్ట అంటూ ఆరోపించారు. ప్రజలను మసిపూసి మారేడు కాయ చేసి మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రాంతాన్ని, చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి అధికారంలోకి వచ్చారంటూ విరుచుకుపడ్డారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో చేసిన జిమ్ముక్కులు ఇక్కడ చెల్లవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. జేడీఎస్ కు తోకపార్టీగా మారింది మీరు కాదా అంటూ నిలదీశారు. ఇకపై టీఆర్ఎస్ పార్టీ టక్కుటమారపు గారడీ విద్యలు తెలంగాణలో చెల్లవంటూ మండిపడ్డారు. 
 
త్వరలోనే అన్ని నిగ్గు తేలుస్తామని,కుటుంబ పాలనకు స్వస్తి పలుకుతామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు చరిత్ర సృష్టించబోతున్నారని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ హెచ్చరించారు.