శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (15:41 IST)

తన బరువుకు సమానమైన బంగారం మొక్కు చెల్లించుకున్న వైఎస్.షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరుగనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో మేడారం జాతర ఒకటి. 
 
అయితే, ఈ జాతరకు ముందుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులను తీర్చుకుంటారు. తాజాగా వైఎస్‌ షర్మిల మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించి గిరిజనుల దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్క, సారలమ్మలకు బంగారం (బెల్లం) సమర్పించింది. 
 
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరిన ఆమె గిరిజనుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌కు సమయం సరిపోవడం లేదని విమర్శించారు. 
 
సమ్మక్క, సారలమ్మ గొప్పతనాన్ని కొనియాడిన వైఎస్ షర్మిల.. మేడారం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వందల కోట్ల రూపాయలను మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఏం చేశారంటూ ఆమె ప్రశ్నించారు.