సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (21:04 IST)

మంత్రి కేటీఆర్‌కు షర్మిల బహిరంగ ఛాలెంజ్.. ఏంటది?

ys sharmila
తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల బహిరంగ సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల తన సీటు పోయినా ఫర్లేదు అంటూ వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్‌కు ఆమె తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట స్థానాలను మహిళలకు కేటాయించాలంటూ ఆమె కోరారు. 
 
ఇదే విషయంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్ గారూ.. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండని షర్మిల ఎద్దేవా చేశారు. మీ సీటును త్యాగం చేస్తే మిమ్మల్ని అడ్డుకునేదెవరని ప్రశ్నించారు.
 
నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి, మీ సీటు మహిళకు ఇవ్వండని అన్నారు. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపాలని అన్నారు.
 
మహిళలను దారుణంగా అవమానించిన మీరే ఈరోజు మహిళల గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల కోసం మేం దీక్షలు చేస్తే వ్రతాలంటూ ఎద్దేవా చేసింది మీరేనని... మహిళా మంత్రులు లేకుండా చేసింది మీరేనని... మహిళా కమిషన్ ఉందన్న సంగతే మర్చిపోయారని దుయ్యబట్టారు. 
 
శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవి ఇవ్వలేదని... కానీ, మీ చెల్లి కవితమ్మ ఓడిపోతే, కేసీఆర్ బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు.. మీ కుటుంబం మీద ప్రేమ.. మీకు సామాన్య ప్రజల్ని ప్రేమించే గుణం లేదని అన్నారు. మాటలతో చిత్తశుద్ధి నిరూపణ కాదని.. చేతలతోనే అవుతుందని షర్మిల అన్నారు.