శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (16:52 IST)

వైఎస్ షర్మిల కారవన్‌పై తెరాస శ్రేణుల రాళ్లదాడి

sharmila caravan attacked
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల నుంచి నిరసన సెగతో పాటు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆమె విశ్రాంతి తీసుకునే కారవన్ వాహనంపై కొందరు తెరాస కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 
 
ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 
కాగా, తెరాస మంత్రి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెరాస కార్యకర్తలు ఆగ్రహంతో వైకాపా ఫ్లెక్సీలను చింపివేశారు. షర్మిల కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 
 
దీనిపై షర్మిల స్పందిస్తూ, తెరాస ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సులను తగలబెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నానని, శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్టు చేయాలని, తద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను తమ పాలేర్లుగా తెరాస నేతలు వాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.