శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (09:13 IST)

యాక్ థూ.. మునుగోడు గెలుపు ఓ గెలుపేనా? తెరాసపై షర్మిల సెటైర్లు

sharmila Reddy
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అతికష్టంమీద పదివేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కిపులో మొదటి రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు 10 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల సెటైర్లు వేశారు. ఇదీ ఓ గెలుపేనా అంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి గెలిచామని సంబరాలు చేసుకోవడాని సిగ్గుండాలి సీఎం కేసీఆర్ గారూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరికో ఎమ్మెల్యేను, మండలానికి ముగ్గురు మంత్రులు పెట్టి మద్యం, మనీ పంచి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఓటర్లను బెదిరించి, ఫాంహౌస్ డ్రామా ఆడి ఇలా ఎన్నో కుయుక్తులు పన్నినా కేవలం పది వేల ఓట్లతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అంటూ విమర్శించారు. 
 
పనిలోపనిగా బీజేపీపై కూడా ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొని తెచ్చి, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీ నేతలు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గువచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని  బీజేపీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆమె సూచించారు.