సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (14:20 IST)

అడ్వాన్స్ ఇచ్చాక ఫోన్ చేసి రమ్మని పిలిచేవారు: కాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని నిజాలు

Aamani
Aamani
సినిమారంగంలో హీరోయిన్లకు సమస్యలు అనేవి సావిత్రి టైం నుంచే వున్నవే. ఈవేళ ఏదో కొత్తగా లేదు. అప్పట్లో సోషల్‌మీడియా టెక్నాలజీ లేదు. సినిమా వారపత్రికల్లో వచ్చిన వార్తలే ప్రజలకు తెలిసేవి అని సీనియర్‌ నటి ఆమని తెలియజేసింది. శుభసంకల్పం, శుభలగ్నం, జంబలికిడి పంబ, మిస్టర్‌ పెళ్ళాం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె తాజాగా తన సోదరి కుమార్తెను నటిగా పరిచయం చేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్ర కార్యాలయానికి వచ్చిన ఆమె అక్కడి సన్నిహితులతో పలు విషయాలు తెలియజేస్తూ కాస్టింగ్‌ కోచ్‌పై ఆసక్తికరమైన కథనాలు తెలియజేసింది.
 
ఆమె మాటాల్లోనే.. సినిమారంగంలో అందరూ కష్టపడి పైకి రావాలనుకుంటారు. ఒక్కోక్కరికి ఒక్కో కథ వుంటుంది. మంచి, చెడు అన్ని రంగాల్లో వున్నట్లే సినిమా రంగంలో వుంటుంది. మనం తీసుకునే రీతిలో వుంటుంది.
 
నేను తమిళంలో కాస్టింగ్‌ కోచ్‌ ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను.  పెద్ద కంపెనీలలో ఇలా వుండదు. పెద్ద కంపెనీలలో డాన్స్‌, యాక్టింగ్‌ ఎమోషనల్‌ చేయ్‌.. డైలాగ్‌లు చెప్పండి అని అడగుతారు. కానీ కొత్తగా వచ్చే బేనర్‌లు హీరోయిన్‌ ఛాన్స్‌ వుంది అంటూ మేనేజర్‌ పిలుస్తారు. వచ్చాక 2 పీసెస్‌లు వేయాలి. ఓ సీన్‌లో స్విమ్మింగ్‌ చేయాలి. అంటూ.. స్టెచ్‌ మార్క్‌ మీకుందా! అని అడుగుతారు. లేదండి అని చెబుతాను. కానీ చూడాలంటూ ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే ఓసారి ఇలా చూడకుండా వేషం ఇచ్చాం. కానీ షాట్‌ రెడీ అయ్యాక.. చర్మంపై చారలు కనిపించాయి. అందుకే అడుగుతున్నామంటూ అంటారు. ఇంకొందరైతే మీరు బట్టలిప్పి చూపించండి.. అంటూ అడుగుతారు. అప్పుడు మాకు అర్థమవుతోంది. ఐయామ్‌ సారీ.. నాకు స్విమ్మింగ్‌ కూడా తెలీదు. అని చెప్పేసి వచ్చేశాను. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. 
 
ఇది జరిగాక ఓ సినిమాకు అడ్వాన్స్‌ తీసుకున్నా. తెల్లారి షూటింగ్‌. సాయంత్రం మేనేజర్‌ ఫోన్‌ చేసి మేడమ్‌ డైరెక్టర్‌గారు స్టోరీ డిస్‌కషన్‌ పెట్టుకున్నారు. ఫలానా బీచ్‌ దగ్గరకు రండి. మిమ్మల్ని ఫైనాన్సియర్‌ చూడాలంటున్నారని అన్నాడు. నన్ను చూడాలంటే హీరో, దర్శకుడు చూడాలి.. అని అడిగితే.. అర్థం చేసుకోండి. మేడమ్‌. మంచి సినిమాలో హీరోయిన్‌ అంటూ ఏవో చెప్పేవాడు. చివరగా మీరు మాత్రమే రండి. మీ అమ్మగారిని తీసుకురాకండి..అనేవారు. ఇలా చాలా జరిగాయి. ఓ దశలో మా అమ్మకూడా చెప్పేది. నీకు ఇష్టమని ఈ రంగంలోకి వచ్చావ్‌. కష్టమైతే బెంగుళూరు వెళ్ళి ఏదైనా జాబ్‌ చేసుకో అనేది. అందుకే నేను ఓ దశలో బెంగుళూరు వెళ్ళిపోవాలనుకున్నాను. కొన్ని మంచి సినిమాలు చేశాను. ఆ తర్వాత పిల్లల ఎదుగుదలకు దగ్గరుండాల్సివచ్చింది అంటూ ఆసక్తికరవిషయాలు తెలిపారు.