యూనిట్ సభ్యులపై చిందులేసిన రాజమౌళి... ఆ లీక్ ఎవరు చేశారంటూ ఆగ్రహం?
ఎపుడు నవ్వుతూ కనిపించే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పట్టరాని కోపం వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పడుతున్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మార్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకీ రాజమౌళి అంతలా కోపపడటానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
బాహుబలి వంటి మెగా ప్రాజెక్టు తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అదేసమయంలో ఈ చిత్రం షూటింగ్ అప్‌డేట్స్‌గానీ, వర్కింగ్ స్టిల్స్‌గానీ ఎక్కడా కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ మీద ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా, అందుకు సంబంధించిన ఓ ఫొటో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఓ అడవిలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేశాడు. ఇది చిత్రంలోని ఓ కీలక దృశ్యం కావడంతో దీనిని ఎవరు లీక్ చేసి ఉంటారనే దానిపై చిత్ర బృందం ఆరా తీయడం ప్రారంభించింది. ఇక లీక్ అయిన ఫొటోలో ఎన్టీఆర్, ఒంటిపై ఎటువంటి దుస్తులూ లేకుండా, కేవలం చెడ్డీతో పులితో ఫైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలోనూ ఎన్టీఆర్కు సంబంధించిన దృశ్యాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళికి పట్టరాని కోపం వచ్చి, చిత్ర యూనిట్ సభ్యులపై ఫైర్ అయినట్టు సమాచారం.