సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (19:24 IST)

పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోత.. ప్రేక్షకుల ఆనందమే ముఖ్యం : కాజల్ (video)

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ ఇంటికి కోడలు కానుంది. ఈ నెల 30వ తేదీన ఆమె ముబైకు చెందిన యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడనుంది. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ స్వయంగా మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో నిర్ధారించింది. ఈ పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో సినీ ప్రేక్షకుల్లో ఓ సందేహం ఉత్పన్నమైంది. దీనికి కూడా ఈ చందమామ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అందాలు ఆరబోస్తూ, ప్రేక్షకులకు వినోదం అందిస్తానని చెప్పుకొచ్చింది. 
 
ఇదిలావుండగా, తనకు కాబోయే భర్తతో కలిసి కాజల్ అగర్వాల్ తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా కాజల్, గౌతమ్ కలిసి దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాజల్‌ పెళ్లి వార్త తెలిసి సమంత, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్‌, మెహరీన్‌ శుభాకాంక్షలు తెలిపారు.
 
కాగా, అంతకుముందు తన పెళ్లిపై కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 'నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది.
 
'అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్‌గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను' అని కాజల్ ట్వీట్ చేసింది.