సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (09:08 IST)

బుల్లితెర జయలలితగా రమ్యకృష్ణ

టాలీవుడ్ అందాల నటి రమ్యకృష్ణ. ప్రత్యేక పాత్రలకు పెట్టింది పేరు. హీరోయిన్‌గానే కాకుండా, ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషిస్తోంది. ఒక నరసింహా (పడయప్పా), బాహుబలి వంటి చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. అలాంటి రమ్యకృష్ణ తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను పోషించనుంది. అయితే, వెండితెరపై మాత్రం కాదు. బుల్లితెరపై. 
 
జయలలిత జీవిత చరిత్రతో ఓ టీవీ సీరియల్ రానుంది. మొత్తం 30 భాగాలుగా ఉండే ఈ సీరియల్‌కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారు. అలాగే, నటులు రంజిత్, వినీత్‌లు కూడా ఈ సీరియల్‌లో అత్యంత కీలకమైన పాత్రలను పోషించనున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మూడు చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో ఒకదాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ది ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో జయగా నిత్యా మీనన్ పోషించనున్నారు. 
 
అలాగే, దర్శకుడు విజయ్ తెరకెక్కించే చిత్రంలో పురట్చితలైవిగా విద్యాబాలన్, శశికళ పాత్రలో సాయిపల్లవి, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటించనున్నారు. మూడో చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు భారతీ రాజా నిర్మించనున్నారు. ఇందులో జయలలితగా వరలక్ష్మి శరత్ కుమార్‌ను ఎంపిక చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వార్తపై క్లారిటీ రావాల్సివుంది.