బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:14 IST)

పుష్పలో తరుణ్ రీ ఎంట్రీ.. పుష్పను సుక్కు అలా ప్లాన్ చేస్తున్నారట!

టాలీవుడ్ ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. బాలనటుడిగానూ అతడు అందరకీ పరిచయమే. తరుణ్ హీరోగా నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ తో పాటు కొన్ని హిట్ సినిమాలలో నటించారు. అయితే కథలను ఎన్నుకునే విషయంలో పొరపాట్లు చేయడం వంటి ఇతర కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యారు. అది అలా ఉంటే ఆయన మరోసారి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తరుణ్ ఇటీవల ఆహా ఓటీటీ లో విడుదలైన అనుకోని అతిథి సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్‌కు డబ్బింగ్ చెప్పారు. తరుణ్ వాయిస్ ఫహాద్ ఫాజిల్‌కు చక్కగా కుదిరింది. దీంతో పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పుష్ప సినిమాలో తరుణ్ కనిపించకపోయినా వినిపిస్తారని టాక్. ఒకవేళ విలన్ పాత్రలకి డబ్బింగ్‌తో అదుర్స్ అనిపిస్తే తదుపరి కాలంలో విలన్ పాత్రలు కూడా తరుణ్‌ని వెతుక్కుంటూ వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు. 
 
ఇక పుష్ప విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
సుకుమార్ పుష్ప సినిమాను రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే ఆ వార్త నిజం అని తేలింది. 'పుష్ప' చిత్రానికి పార్ట్‌ 2 కూడా ఉండబోతుందట. దీనికి సంబంధించి ఈ సినిమా నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ఎంతో స్పాన్‌ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌గారితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించాం.. అని పేర్కోన్నారు.
 
పుష్ప టీజర్ ఇప్పటివరకు 64 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో అత్యదిక వ్యూస్ పొందిన టీజర్‌గా నిలిచింది. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. 
 
అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో కొంత భాగాన్ని చిత్రీకరించింది. ఫారెస్ట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను తమిళ నాడులోని తెన్ కాశీ పరిసరాలలో నిర్వహించారు. అక్కడ కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు.