గరికపాటి, చిరంజీవి ఉదంతంపై సమగ్ర విశ్లేషణ, అభిమానుల వినూత్న నిరసన
విద్వత్తు వున్న మనుషులకు కాస్త కోపం కూడా వుంటుంది. అంతా సాత్వికంగా వుండాలంటే కుదరదు. ఇందుకు చాలా మంది ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆధ్మాత్మిక ప్రవక్త గరికపాటి నరసింహారావుకు పేరులో సింహం వుంది కాబట్టి కోపం ఎక్కువే అని చాలాసార్లు తన ప్రవచనాల్లో చెప్పారు. అది తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను అని కూడా అన్నారు. ఇది చెప్పినంత ఈజీకాదు అనికూడా ఆయనే పలుసార్లు వెల్లడించారు. అలాంటి ఆయన ఒక్కోసారి గాడి తప్పకతప్పిందికాదు. ఇటీవలే అలయ్ బలయ్ వేడుకలో గరికపాటి స్పందన అలానే వుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుకు వస్తుంది.
శంకరాభరణం సినిమాలో, చక్కటి సంగీత కచేరి జరుగుతుంటే జమీందారు వచ్చి కుర్చీ బరబరా లాగేసి, నచ్చిన అమ్మాయితో ముచ్చట్లు పెడితే శంకరశాస్త్రికి మండుకు వచ్చి, లేచి చక్కాపోతాడు. అప్పుడు సినిమా చూశాక అందరూ శంకరశాస్త్రి చేసిందే కరెక్టే అన్నారు. మరి అది సినిమా. కానీ నిజజీవితంలోకి వచ్చేసరికి అలాంటి సంఘటనే చిరు, గరికపాటి ఉదంతం అయినా రియాక్షన్ విరుద్ధంగా జరిగింది.
మొత్తంగా పరిశీలిస్తే, గరికపాటి కాసేపు ఆగి, ఫొటోల కార్యక్రమం అయ్యాక నేను మాట్లాడటం మొదలు పెడతాను అని వుంటే చాలా బాగుండేదని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందించడం చూస్తూనే వున్నాం. కానీ అది ఇంకా సద్దుమణగలేదు. దానికి నిదర్శనం ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత ఓ ప్రకటన, పోస్టర్ విడుదల చేసింది.
శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవికి కూడా చాలా కోపం. కానీ గాంధీ మార్గంలో వెళ్ళాల్సిన పరిస్థితి రావడంతో ఆయన గులాబి పువ్వు ఇచ్చి ప్రతినాయకుడిలో మార్పుకు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఇదే తరహాలో చిరంజీవి అభిమానసంఘం చేస్తోంది. అందుకు ఓ చక్కటి కవితను కూడా రాసింది. ఇలా దసరానాడు అంకురించిన ఈ వివాదం ఇంకా కొనసాగడం విశేషమే మరి. ఇందుకు వివిధ రకాల మీడియా కూడా ఫోకస్ చేయడంతో పెద్ద రాద్దాంతం అయింది. కొన్ని మీడియాలు పని కట్టుకుని ఈ సంఘటనను హైలైట్ చేశాయని టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. అదే మీడియా గాడ్ ఫాదర్ సినిమాపై పలు విమర్శలు చేసి, ఫైనల్‌గా సక్సెస్ అంటూ వ్రాయాల్సి వచ్చింది. సో. గరికపాటి, చిరంజీవి వివాదం కూడా అలాంటిదేమో చూడాలిమరి.