శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (10:22 IST)

హౌస్ అరెస్ట్‌పై.. మోహన్ బాబు, మంచులక్ష్మి ఏమన్నారంటే?

సినీ నటుడు, శ్రీ విద్యా నికేతన్ సంస్థల అధినేత మోహన్‌బాబుకు పోలీసులు గృహ నిర్బంధం విధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంలో జాప్యం చేస్తోందని విద్యానికేతన్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆయనను ఇంటి నుండి బయటకు రానీకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.
 
ఈరోజే కుప్పంలో చంద్రబాబు నామినేషన్ వేయనుండటంతో జిల్లాలో ఇటువంటి ర్యాలీలు నిర్వహిస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు పోలీసులు తెలియజేసారు. శుక్రవారం  వేలాది మంది విద్యార్థులతో విద్యా నికేతన్ క్యాంపస్ నుండి తిరుపతి వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనేది మోహన్‌బాబు ఆలోచన. 
 
అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తన విద్యాసంస్థల ఎదుటే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మొహరించాయి.
 
దీనిపై మోహన్ బాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తిరుపతిలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నానని, కానీ తన ఇంటి ముందు ఉన్న పోలీసులు, బయటకు వెళ్లేందుకు అంగీకరించడం లేదంటూ మోహన్ బాబు ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.
 
అలాగే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ‘స్కేర్డ్ పీపుల్ ’అంటూ ఆమె ట్వీట్ పెట్టారు. మోహన్ బాబు చేస్తున్న ఆందోళన చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారంటూ పరోక్షంగా అర్థం వచ్చేలా స్పందించారు. ప్రస్తుతం మంచులక్ష్మి చేసిన ట్వీట్‌కు విద్యార్థులంతా మద్దతు పలుకుతున్నారు. మంచు ఫ్యామిలీకి అండగా ఉంటామని ట్వీట్ చేస్తున్నారు. 
 
ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా మోహన్ బాబు ధర్నా చేపడతానన్నారు. ఇప్పటికే ఆ మధ్య ఈ విషయంలో ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. మోహన్ బాబు కుమారుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన విష్ణు కూడా బాహాటంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.