శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:31 IST)

పుష్ప ఫస్ట్ లుక్‌తోనే బన్నీ రికార్డులు మొదలెట్టేసాడుగా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. 
 
అల.. వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడం.. అలాగే ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ - సుక్కు కలిసి చేస్తున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను మరింత ఆసక్తి ఏర్పడింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పుష్ప ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది.
 
ఇదిలా ఉంటే... సినిమా రిలీజ్ కాకుండానే... పుష్ప రికార్డులు సృష్టించడం స్టార్ట్ చేసింది. రిలీజ్ కాకుండానే రికార్డులా అనుకుంటున్నారా...? విషయం ఏంటంటే... సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 20వ చిత్రంగా ఈ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ అండ్ రఫ్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే... బన్నీ నయా అవతారం ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్లో రికార్డు నమోదు చేసింది. రికార్డ్ ఏంటంటే... అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్‌గా పుష్ప నిలిచింది.
 
బన్నీ పోస్ట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి 14.5 వేల మంది రిప్లై ఇవ్వగా, 16.5 వేల మంది రీట్వీట్ చేసారు. 88.3 వేల మంది లైక్ చేసారు. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. దీనితో తమ హీరో ఫస్ట్ లుక్‌తోనే రికార్డుల వేట మొదలుపెట్టారు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 
 
పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ప్లాన్. మరి.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప ఇక సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.