1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (10:40 IST)

పుష్ప విషయంలో అల్లు అర్జున్ అంచనా కరెక్టేనా!

Pushpa, Allu Arjun
Pushpa, Allu Arjun
కొన్ని సినిమాల గురించి ముందుగా అలా తెలిసిపోతుంటాయంతే. అలా పుష్ప సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంచనా వేసిన ప్రతీ విషయం నిజమైపోతుందిప్పుడు. విడుదలకు ముందు నుంచే ఈ చిత్రంపై సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ టేకింగ్ గురించి.. ఆయన సినిమా తెరకెక్కించిన విధానం గురించి ప్రీ రిలీజ్ టైమ్‌లోనే చెప్పారు. పుష్ప విడుదలయ్యాక ఇండియా అంతా షేక్ అయిపోతుందని అంచనా వేసారు బన్నీ. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. పుష్ప రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనాలు రేపిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమా మేనరిజమ్స్ ఇండియాను ఊపేస్తాయని నమ్మకంగా చెప్పారు బన్నీ. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. అంతేకాదు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు.
 
ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పిన మరో మాట కూడా నిజమైంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ ఒకటి వైరల్ అవుతుంది. దర్శకుడు సుకుమార్‌ను పొగుడుతూ.. పుష్ప సినిమాను ఆయన వర్ణించిన తీరు అద్భుతం. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేసారు రాజ్ కుమార్ హిరాణి. ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేసారు. పుష్ప విడుదలై సక్సెస్ అయితే కనక.. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద దర్శకులంతా సుకుమార్ గారి దగ్గరికి వచ్చి.. క్లాసులు తీసుకోకపోతే నేను చొక్కా విప్పుకుని మైత్రి ఆఫీస్‌లో తిరుగుతానంటూ అప్పట్లో ఛాలెంజ్ చేసారు బన్నీ. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది. తాజాగా బన్నీ అంచనా నిజమై.. ఏకంగా ఇండియన్ లెజెండరీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి కూడా సుకుమార్ టేకింగ్‌కు ఫిదా అయిపోయారు. ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తడమే కాకుండా.. కొన్ని షాట్స్, సీన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏదేమైనా పుష్ప సినిమా విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యంగా నిలుస్తుంది.