శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (12:00 IST)

మరీ ఇంత ఓపెన్‌గా.. మెగా హీరోలకే సాధ్యమేమో..?

సాధారణంగా ఓటమిని ఒప్పుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఎలాగోలా ఆ ఓటమి బాధ్యతను ఎవరో ఒకరిపై నెట్టేయడం జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పొచ్చు.

తమ సినిమాలకు హైప్ పెంచాలనే ఉద్దేశ్యంతో తప్పుడు లెక్కలు చూపడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ కాలంలో కూడా అదీ సినీ పరిశ్రమలో నిజాయితీగా ఓటమిని ఒప్పుకునే హీరోలు ఉన్నారని నిరూపించారు అల్లు శిరీష్. 
 
అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ సినీ పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టి ఎలాగైనా స్థిరపరుచుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన ఏబీసీడీ మూవీ విడుదలై, మునుపటి సినిమాల మాదిరిగానే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.


మలయాళంలో వచ్చిన ఏబీసీడీ సినిమాను రీమేక్ చేస్తూ సంజీవ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై అల్లు శిరీష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మే 17 విడుదలైన మొదటి రోజు నుండే డీలా పడిపోయింది.
 
గురువారం (మే 30) అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎబిసిడి సినిమా ఫ్లాప్ గురించి ట్విట్టర్‌లో ఓ లేఖను పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ''డైరెక్టర్ సంజీవ్ రెడ్డితో పాటు ‘ఏబీసీడీ' బృందం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎంతగానో కృషి చేశారు.

కానీ ఊహించినట్లుగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాము, అందుకే ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తున్నాం. ఈ జర్నీలో ఎంతగానో సహకరించిన నిర్మాతలతో పాటుగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు అల్లు శిరీష్.
 
గతంలో 'వినయ విధేయ రామ' ఫ్లాప్ అయినప్పుడు రామ్ చరణ్ కూడా ఇలాగే స్పందించాడు. ఇప్పుడు అదే విధంగా అల్లు శిరీష్ కూడా చేయడంతో మెగా అభిమానులు రియల్ హీరో అంటూ ప్రశంసలతో ముంచేస్తున్నారు.