శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (10:12 IST)

నేను చేసే సాయం గురించి ఇపుడు చెప్పాల్సిన సమయం వచ్చింది.. అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. పైగా, ఈయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్‌లు కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారే. బిగ్ బి సతీమణి రాజ్యసభ సభ్యురాలు. అయితే, బిగ్ బి కుటుంబం పేదలకు పెద్దగా సాయం చేసిన దాఖలులేవనే ప్రచారం ఉంది. ఇపుడు ఓ యువతి సూటిగా ఇదే ప్రశ్న వేశారు. అమితాబ్ పేదలకు చేసిన సాయం ఏంటని ఆ యువతి ప్రశ్నించింది. దీనికి అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో సమాధానమిస్తూ సుదీర్ఘ పోస్ట్ ఒకటి చేశారు. 
 
'నేను పేదలకు చేస్తున్న సాయాన్ని గురించి చెప్పడం లేదంటూ నేడు ఓ మహిళ ప్రశ్నించింది. చేసే సాయం గురించి ప్రచారం చేసుకోరాదని నేను నమ్ముతాను. అందుకే నేను చేసే సాయం గురించి చెప్పుకోను. కానీ, ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాను. గడచిన ఆరు నెలలుగా చిత్ర పరిశ్రమలోని పది వేల కార్మికుల కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్నాము.
 
ఇక ముంబై నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళుతున్న వలస కార్మికులకు 12 వేల జతల చెప్పులను అందించాము. నాసిక్ జాతీయ రహదారిపై వలస కార్మికుల కోసం ఆహార శిబిరాలను ఏర్పాటు చేసి, భోజనం, నీరు అందించాము. ప్రైవేటు విమానాలను బుక్ చేసి, వీలైనంత మందిని వారివారి ప్రాంతాలకు పంపించాము. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు 15 వేల పీపీఈ కిట్స్, వేలకొద్దీ మాస్క్‌లను అందించాం' అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.