సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అమితాబ్‌కు కరోనా వైరస్ - అనుక్షణం అప్రమత్తతో వైద్యులు

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌‌కు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా వైరస్ బారినపడుతున్నారు. అయితే, అమితాబ్‌కు వయసు 77 యేళ్లు. పైగా కాలేయ, ఉదర సంబంధిత సమస్యలు. గతంలోనే పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స. 
 
ఈ వయసులో అమితాబ్ బచ్చన్‌కు ప్రాణాంతక కరోనా సోకడం, గత రాత్రి నానావతి ఆసుపత్రిలో చేరడంతో, అక్కడి వైద్యులు అనుక్షణం అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తున్నామని అన్నారు. 
 
ప్రస్తుతానికి అమితాబ్‌కు వెంటిలేటర్‌ను అమర్చలేదని స్పష్టం చేసిన వైద్యులు, ఆయన వయసు, శారీరక సమస్యలను దృష్టిలో ఉంచుకుని చికిత్సను అందిస్తున్నట్టు వెల్లడించారు. సరైన ట్రీట్మెంట్‌తో ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. 
 
కాగా, 1982లో 'కూలీ' చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయనకు కాలేయ సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. 
 
క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో గత నాలుగు దశాబ్దాలుగా ఆయన తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు.