సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (09:29 IST)

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా ఎలా సోకింది? ఇపుడు ఎలా వుంది?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు శనివారం రాత్రి వచ్చాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న అమితాబ్‌కు కరోనా వైరస్ సోకిందన్న వార్త తెలియగానే మొత్తం చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. 
 
మార్చి 23న లాక్డౌన్ ప్రారంభించిన రోజు నుంచి ఆయన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు వీడియోలు రూపొందించారు. ఇంట్లోనే ఉంటూ ఇతర భాషల హీరోలు చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్ తదితరులతో కలిసి ఓ లఘు చిత్రంలో కూడా నటించారు. అటువంటి ఆయన్ను కరోనా వైరస్ ఎలా చేరింది?
 
వాస్తవానికి లాక్ డౌన్ సడలింపులు ప్రారంభమైన తర్వాత, అమితాబ్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. తాను హోస్ట్‌గా వ్యవహరించాల్సిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సెలక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత అమితాబ్ పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. 
 
అక్కడికి వచ్చిన వారిలో ఎవరిలోనో వైరస్ ఉండి వుండవచ్చని, వారి నుంచే అమితాబ్‌కు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు? వారిలో ఎవరికి వైరస్ ఉందన్న విషయమై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పీఆర్వో వెల్లడించారు. అమితాబ్‌ను ఐసొలేషన్ యూనిట్‌లో ఉంచామని  వెల్లడించారు. అమితాబ్ వయసు 77 సంవత్సరాలు కాగా, ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని అన్నారు.
 
అమితాబ్‌కు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరిపించామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. ఈ తండ్రీ కొడుకులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ కావాలని సూచించారు.