గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: మంగళవారం, 19 మార్చి 2019 (19:52 IST)

అందుకే ప్రమాదం జరిగితే ఢీకొట్టినవారు కారులో పారిపోతారు... రష్మి కామెంట్స్

యాంకర్ రష్మీ గౌతమ్ ఉన్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదంగా మారింది. ఈ ఘటన గురించి మీడియాలో పలు కథనాలు వచ్చాయి, ప్రమాద సమయంలో ఆమే డ్రైవ్ చేస్తున్నట్లు, అది రష్మీ కొత్త కారని, ఆ కారును సీజ్ చేసారని, ఆమెను అరెస్ట్ చేసారని పలువార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ మీడియా ముందుకు వచ్చి ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వివరించారు.
 
ఒక వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుని కంపెనీవారు ఏర్పాటు చేసిన కారులో ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, విశాఖపట్నం దగ్గర్లో అగ్నంపుడి హైవే వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతూ కారు కిందపడ్డాడు. ఆ సమయంలో డ్రైవర్ కారు నడుపుతుండగా నేను పక్క సీట్లో కూర్చుని ఉన్నాను. ఆ వ్యక్తి కారు కింద పడిన వెంటనే 108 సర్వీస్‌కు ఫోన్ చేశాను. 
 
అంబులెన్స్ రావడం ఆలస్యమైనందున అతడిని ముందుగా ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించి, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్‌కు మార్చాము. ఈ యాక్సిడెంట్‌పై దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని, డ్రైవర్ గౌతమ్‌ను కస్టడీలోకి తీసుకొన్నారు. నాపై వస్తున్న రూమర్లు, అసత్య కథనాలు తప్పని చెప్పడానికి నేను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.
 
ప్రమాదం జరగగానే సహాయపడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. పైగా సహాయం చేద్దామని నేను అద్దం దించగానే ఫోటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు. మనిషి ప్రాణం పోతుంటే ఇలా ప్రవర్తిస్తారా అని నేను ప్రశ్నించగా, ఏంటమ్మా కారు ఇలానేనా నడిపేదని ఎదురుప్రశ్నించారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని గొడవ చేయడం మొదలుపెట్టారు. కనీసం అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వలేదు. కొందరు యువకులు ముందుకొచ్చి సహాయం చేసారు. ఆ సమయంలో కొందరి ప్రవర్తనకు నేను చాలా విసిగిపోయాను. అందుకేనేమో ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు పారిపోతారనిపించిందంటూ పేర్కొంది. ఇక గాయపడిన వ్యక్తి బాగానే ఉన్నాడని, నా ప్రొడక్షన్ టీం అన్ని రకాలుగా సహాయం చేస్తోందని తెలిపారు.