గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:26 IST)

ఏపీ ప్రజలకు సరైన నాయకుడు పవన్ కళ్యాణ్: విజయశాంతి

నెల రోజుల క్రితం రాజ్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో రహస్య మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చించినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటే, కేసీఆర్ గారు వేసే ఫెడరల్ ఫ్రంట్ ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడరనే నేను అదే రోజు కామెంట్ చేశాను. దాన్ని మీడియా బాగా ఫోకస్ చేసింది. 
 
నేను ఊహించిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారి ఉచ్చులో పడకుండా ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టి, తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. రాజమండ్రి వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన సమర శంఖారావ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా భావించకుండా, ఇది ఆంధ్రుల మనోవేదనగా పరిగణించాలి. 
 
ఇంతకాలం కేసీఆర్ గారి నియంతృత్వ పోకడను నిలదీసేందుకు సీమాంధ్రుల్లో సరైన నేత లేరనే వాదన వినిపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అందరి అంతరంగాల్ని ఆవిష్కరించే విధంగా సాగింది. సీమాంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరికతో ప్రతీ ఒక్క ఆంధ్రుడు ఏకీభవిస్తాడు. ఏపీ ప్రజల పాలిట విలన్‌గా మారిన బీజేపీకి బినామీగా ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలనుకుంటున్న కేసీఆర్ గారిని అక్కడి ప్రజలు అంగీకరించే పరిస్ధితి లేదు. 
 
కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం రావాలి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఇప్పటికే సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధమైపోయారు. వారిని తప్పుదోవ పట్టించడానికి మోదీగారితో కలిసి కేసీఆర్ గారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన అవి ఏవీ ఫలించవని విజయశాంతి అన్నారు.