బొత్స మాటలకు సినీ పెద్దల మండిపాటు!
సినిమా టికెట్లపై ఎ.పి. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కౌంటర్‌పై సినీ పరిశ్రమ మండిపడుతోంది. గురువారంనాడు విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు సినిమా టికెట్ల ధర సామాన్యులకు అందుబాటులో తేవడమే ప్రభుత్వం ధ్యేయమని పేర్కొన్నారు. పరిశ్రమను ఇబ్బందికి గురిచేయడం కాదని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇష్టానుసారం టిక్కెట్లు పెంచితే ప్రభుత్వం ఊరుకోదని అన్నారు.
దీనిపై గురువారం ఫిలింఛాంబర్‌లో సినీప్రముఖులు చర్చ జరిగింది. సామాన్యులకు అందుబాటులో అనే నెపంతో ఎ.పి. ప్రభుత్వం చేస్తున్న చర్యను దుయ్యబట్టారు. ఎ.పి. పాలనలో సామాన్యుడికి అందుబాటులోనే అన్నీ వున్నాయా? వారు ఎన్నో సమస్యలపై పోరాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రభుత్వం వైన్ షాపులలో ఇష్టానుసారంగా రేట్లు పెంచడం, డూప్లికేట్ మందులు విక్రయించడం వంటివి వారికి వర్తించవా? అంటూ ఘాటుగా చర్చ సాగింది. అదేవిధంగా సామాన్యుడికి అందుబాటులో వుంటే ఎ.పి.లో డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుకున్నారంటూ.. ఎద్దేవ చేశారు. ఇలా ప్రభుత్వం అనాలోచిత చర్యకు సినీ పరిశ్రమ ఒక్కటే బలి అవుతుందని వారు వాపోతున్నారు. ఏదిఏమైనా దీనిపై అందరూ ఒక్కతాటిపై రావాల్సిన అవసరం వుందని పేర్కొంటున్నారు.