దిలీప్ కుమార్ - అక్కినేని ఇద్దరిదీ దైవ నిర్ణయమే
జీవితంలో మనిషి ఏవిధంగా వెలుగులోకి వస్తాడో చెప్పలేం. కీర్తి ప్రతిష్టలు, డబ్బు, హోదా రావాలంటే చాలా కష్టపడాలి. అందుకు దైవనిర్ణయం అనండి, అదృష్టం అనండి అవి వుంటేనే ఏ మనిషైనా పదిమంది దృష్టిలో పడతాడు. సినిమా, రాజకీయ రంగంలో వీటిని అందరూ నమ్ముతారు. భారత చలన చిత్రరంగంలో అలాంటి ఇద్దరు వ్యక్తులు వున్నారు. వారే దిలీప్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరూ సినిమారంగ ప్రవేశం చిత్రంగా జరిగింది. అదో సినిమా కథలా అనిపిస్తుంది. ఒకప్పుడు బస్‌కోసం మదరాసులో ఓ బస్టాప్‌లో వుంటే అక్కడ బాగున్నవారిని సినిమాల్లోకి దర్శక నిర్మాతలు తీసుకువచ్చేవారని అప్పట్లో ప్రచారం జరిగేవి. అదెలావున్నా అది నిజమైతే భలేవుంటుంది. వినడానికి చాలా ఆసక్తిగా సినిమా కథలా వుంటుంది.
ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాకు పరిచయం చేసాడు. ఈ విషయాన్ని చాలాసార్లు అక్కినేనిగారు చెప్పేవారు. ఆయన మనవుడు ప్రస్తుత సంగీత దిగ్గజం థమన్ కూ కూడా చెప్పి ఆప్యాయంగా తమ కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. ఇప్పటికీ అక్కినేని నాగార్జునకు థమన్ అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా.
ఇక దిలీప్ కుమార్ సినీరంగప్రవేశం కూడా సినీమా కథలానే జరిగింది. పూనెలో తన తండ్రి తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తుంటే ఆయనతోపాటు వుండేవాడు మహమ్మద్ యూసఫ్‌ఖాన్. బొంబో టాకీస్ అధినేతలో ఒకరయిన దేవికారాణి అలా బజారు వెళుతుంటే పండ్లు అమ్ముతున్న యూసుఫ్‌కాన్‌ను చూసి తన సినిమాకు హీరో ఇతనే అని ఫిక్స్ అయింది. ఆ వెంటనే బోర్డు మీటింగ్‌లో సభ్యులముందు తీసుకువచ్చింది. అప్పటికే సినిమా రంగంలో అశోక్‌కుమార్ నటుడిగా వెలిగిపోతున్నాడు. అందుకే అక్కడివారిలో ఒకరు యూసుఫ్‌ఖాన్ పేరు దిలీప్ కుమార్‌గా మార్చేశారు. అలా దిలీప్ కుమార్ అయిన ఆయనతో తొలిసినిమాగా 1944లో జ్వార్ భాటా తీశారు. కానీ ఆ సినిమా నిరాశపర్చింది. విమర్శకులు దిలీప్ నటనను చీల్చిచెండారు. దాంతో పట్టుదలతో కొన్ని మెళుకవలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జుగ్ను, దీవార్, దేవాస్, మధుమతి ఆయన కెరీర్‌ను మార్చేశాయి.
సో. అక్కినేని, దిలీప్ కుమార్ ల సినీజీవితం నిజంగానే ఓ కథలా అనిపిస్తుంది. ఎక్కడో పెషావర్‌లో పుట్టి పెరిగిన యూసుఫ్‌ఖాన్ తన తండ్రికి వున్న భూమికోసం పూనె రావడం ఏమిటి? అక్కడ దేవికారాణి చూడడం ఏమిటి? అనేది థ్రిల్ సినిమాలా అనిపిస్తుంది. అదేవిధంగా నాటకాలు ఆడుతూ ఆ ఊరు ఈవూరు తిరుగుతూ గుడివాడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగడం. అదే టైంలో మరో ట్రైన్‌లో ఘంటసాల రావడం అక్కినేనిని చూడడం. సినిమాల్లోకి తీసుకోవడం అంతా దైవ నిర్ణయమేకదా.
విషాదపాత్రలకు పెట్టింది పేరు
ఇక సినిమాలు చేసే క్రమంలో ఇద్దరూ విషాదాంతమైన కథలే వరించేవి. అలా ఇద్దరూ ట్రాజెడీ కింగ్‌లే. దేవదాసు నుంచి ప్రేమాభిషేకం వరకు పలు చిత్రాల్లో గుండెల్ని పిండేసేలా జనాల్ని ఏడిపించాడు అక్కినేని. అదేవిధంగా దిలీప్ కుమార్ ట్రాజెడీ సినిమాలే ఎక్కువగా చేశాడు. ఓ దశలో ఆ పాత్రలు చేస్తూంటే దిలీప్ మానసిక స్థితి పూర్తిగా మారిపోయేది. అనారోగ్యం పాలవుతారని గ్రహించిన డాక్టర్లు ఆయన్ను ఆ పాత్రలు తగ్గించమని వినోదం పాళ్ళు పెంచే సినిమాలు చేయమని సలహాలు కూడా ఇచ్చారు. సేమ్ ఇదే పరిస్థితి అక్కినేనికి ఎదురయింది. అక్కినేనికి గుండె ఆపరేషన్ కు ముందే ఆరోగ్యం సరిగా లేనప్పుడు విషాద పాత్ర వద్దని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఆపరేషన్‌కు విదేశాలకు వెళ్ళారు. విదేశీ డాక్టర్లు ట్రాజెడీ సినిమాలు నటించవద్దని చెప్పారు. అలా డాక్టర్ల సూచన మేరకు ఇద్దరూ వినోదాత్మక సినిమాలు చేశారు.
ఇద్దరికీ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. అందుకే భారతీయ సినిమా రంగంలో ఇద్దరిదీ ప్రత్యేకమైన పేజీలిగా స్థిరస్థాయిగా నిలిచపోయారు. వారితోపాటు ఎస్.వి.ఆర్,.ఎన్.టి.ఆర్. కూడా విషాదపాత్రలకు పెట్టిందిపేరు. ఓ సందర్భంగా ఆ నలుగురు కలిసిన అరుదైన ఫొటోను మీరు చూడవచ్చు.