ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2025 (19:31 IST)

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

Brahmanandam, Raja Gautham, Rahul Yadav Nakka
Brahmanandam, Raja Gautham, Rahul Yadav Nakka
‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో  బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
 
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డా.బ్రహ్మానందం మాట్లాడుతూ..‘బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు. మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడని మెచ్చుకుంటూ ఉంటే తండ్రిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొత్త పాత్రలను చేయాలనే ఎప్పుడూ కోరుకుంటాను. నన్ను అభిమానించే ఆడియెన్స్‌కు ఏదైనా కొత్తగా అనిపించాలనే ఉద్దేశంలోనే సినిమాను చేస్తుంటాను. చాలా కాలం తరువాత ఓ మంచి సినిమాను, మంచి పాత్రను చేశాననే సంతృప్తి కలిగింది. ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించే గొప్ప అంశాలేమీ ఇందులో లేవు. నేను, వెన్నెల కిషోర్, స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్, నా కొడుకు రాజా గౌతమ్‌లు మాత్రమే ఉన్నారు. ‘మీరు చాలా రోజుల తరువాత కనిపిస్తున్నారు కదా? అందుకే థియేటర్లకు జనాలు వస్తున్నారు’ అని చాలా మంది చెబుతుంటే ఆనందంగా ఉంది. 
 
ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు కాకుండా రంగమార్తాండ లాంటి కారెక్టర్లు చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. నా మీద ప్రేమతో యంగ్ దర్శకులు వచ్చి.. ఒక్క రోజు పాత్ర ఉంది.. చేయండి సర్ అని అడుగుతుంటారు. అలా చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా?.. నేను ఆ పాత్ర చేస్తే వాళ్లకి ఉపయోగపడుతుంది కదా? అని నేను చిన్న పాత్రల్ని అయినా చేస్తున్నాను. నా కోసం ఇంత మంది థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తున్నారు అని తెలిసి ఎంతో ఆనందమేస్తోంది’ అని అన్నారు.
 
హీరో రాజా గౌతమ్ మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా నా గురించి మాట్లాడుతున్నారు. మా నాన్న ఇంట్లోనూ నాతో పాటు సరదాగా ఉంటారు. స్క్రీన్ మీదకు వచ్చే సరికి మాత్రం చాలా సీరియస్‌గా ఉండేది. మా నాన్న ఎప్పుడూ కూడా మా మీద ఒత్తిడి  పెంచలేదు. అలా ఎందుకు చేశావ్.. ఇలా ఎందుకు చేశావ్ అని కాకుండా.. అన్నీ మా నిర్ణయాలకే ఆయన వదిలేస్తుంటారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ గారితోనే ఓ సినిమాను చేస్తున్నాను. వైబ్ సినిమాలో మరింత కొత్తగా కనిపిస్తాను. మను తరువాత ధూత చేశాను. ఆ తరువాత బ్రేక్ అవుట్ చేశాను. మళ్లీ ఇప్పుడు ఈ మూవీని చేశాను. కంటిన్యూ పని అయితే చేస్తూనే ఉన్నాను. నేను పెట్టే ఎఫర్ట్స్‌ను మాత్రం నాన్న గారు గమనిస్తూనే ఉంటారు’ అని అన్నారు.