ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (08:27 IST)

'బీస్ట్‌'తో పోల్చేందుకు ఇవేమీ ఎన్నికలు కావు : 'కేజీఎఫ్' హీరో యష్

ఎంతగానో ఎదురు చూస్తున్న "కేజీఎఫ్ చాఫ్టర్ 2" చిత్రం ట్రైలర్‌ ఆదివారం రాత్రి బెంగుళూరులో అట్టహాసంగా రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. కన్నడంలో శివరాజ్ కుమార్ రిలీజ్ చేశారు. ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన ట్రైలర్ ఆవిష్కరణలో హీరో యష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చిత్రాన్ని "బీస్ట్‌"తో పోల్చొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఒక చిత్రాన్ని మరో చిత్రంతో పోల్చేందుకు ఇవేమీ ఎన్నికలు కాదంటూ ఆయన హితవు పలికారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, తమ చిత్రాన్ని తమిళ హీరో విజయ్ నటించిన "బీస్ట్" సినిమాతో పోల్చవద్దని కోరారు. సినిమా రంగానికి విజయ్ ఎంతో చేశారు అంటూ కొనియాడారు. అయినా ఒక చిత్రాన్ని మరో చిత్రంతో పోల్చడానికి ఇవేమీ ఎన్నికలు కావని యష్ స్పష్టం చేశారు. ఇది సినిమా రంగం. మనం రెండు సినిమాలను చూద్ధాం. భారతీయ చిత్ర రంగంలో సంబరాలు చేసుకుందాం అని పిలుపునిచ్చారు. 
 
కాగా, విజయ్ నటించిన "బీస్ట్" చిత్రం ఏప్రిల్ 13వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ఆ మరుసటి రోజు "కేజీఎఫ్-2" విడుదలవుతుంది. ఒక్క రోజు తేడాతో ఈ రెండు భారీ చిత్రాలు విడుదల అవుతుండటంతో వీటి మధ్య కలెక్షన్స్ వార్ ఖాయమని మీడియాలో కథనాలు వస్తున్నాయి.