సింగర్ కనిక కపూర్ ద్వారా 400 మందికి కరోనా?!

Kanika Kapoor
ఠాగూర్| Last Updated: శనివారం, 21 మార్చి 2020 (08:57 IST)
బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే, ఈమె లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత ఓ పార్టీకి హాజరైంది. ఈ పార్టీకి సుమారుగా 400 మంది నుంచి 500 మందికిపైగా పాల్గొన్నట్టు సమాచారం. ఇపుడు వీరందరికీ ఈ వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఏ ఒక్క దేశాన్ని వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కనికా కపూర్ ఇటీవల లండన్‌కు వెళ్లి వచ్చింది. లండన్ నుంచి వచ్చిన ఆమె నేరుగా స్వదేశంలో జరిగిన పార్టీలో పాల్గొనడం, దానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కావడం, ఆ తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఆమె ఒక్క పార్టీలోనే పాల్గొందని చెబుతున్నా.. ఆమె తండ్రి రాజీవ్ కపూర్ మాత్రం తన కుమార్తె మూడు పార్టీల్లో పాల్గొందని దాదాపు 400 మందిని కలిసిందని చెప్పడం తీవ్ర సంచలనమైంది. తన కుమార్తె కనిక మూడు వేర్వేరు పార్టీల్లో దాదాపు 400 మందిని కలిసిందని పేర్కొన్నారు. అందులో ఆరుగురు తమ కుటుంబం వారేనని తెలిపారు. ప్రస్తుతం తామందరం ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు.

అయితే, తండ్రి వ్యాఖ్యలను కనికా కపూర్ ఖండించింది. తాను ఒకే ఒక్క గెట్ టుగెదర్‌లో పాల్గొన్నానని, 30 మందిని మాత్రమే కలిశానని పేర్కొంది. ఈ
నెల 13న తాను ఒకే ఒక్క పార్టీకి హాజరయ్యానని పేర్కొన్న కనిక.. ఈ వారమంతా చేతులకు గ్లోవ్స్ ధరించే ఉన్నానని తెలిపింది.

మరోవైపు, కనిక పార్టీకి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె తనయుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరు కావడం, దుష్యంత్‌ ఆ తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పలువురు నేతలను కలవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కనిక పార్టీకి హాజరైన వారందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే తమను సంప్రదించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.దీనిపై మరింత చదవండి :