గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 21 సెప్టెంబరు 2019 (15:12 IST)

అన్నపూర్ణ స్టూడియోలో హరీశ్ శంకర్‌ను ఏడిపించిన డైరెక్టర్ ఎవరు?

షాక్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. మిర‌ప‌కాయ్, గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న యువ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. తాజాగా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకి మాస్ ఆడియ‌న్స్ నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఇటీవ‌ల ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్‌ శంకర్ మాట్లాడుతూ... కెరియర్ తొలినాళ్లలో తనకి ఎదురైన బాధాకరమైన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు.

ఇంత‌కీ ఆ సంఘ‌ట‌న ఏంటంటే... మొదటి నుంచి కూడా సినిమాలంటే ఇష్టం. అందువల్లనే దర్శకుడిని కావాలనే ఉద్దేశంతో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా దాదాపు రెండేళ్లు పని చేశాను. కథాచర్చల్లో పాల్గొన్నాను. క‌థ‌పై కసరత్తు చేశాను. ఒక రోజున అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పత్రికల్లో నా పేరు చూసుకోబోతున్నాను అనే ఆత్రుతతో షూటింగ్ స్పాట్‌కి వెళ్లాను.
 
ముహూర్తం రోజున సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల పేర్లను మీడియాకి ఇస్తారు. అయితే... ఆ లిస్టులో నా పేరు లేదు. దర్శకుడిని ఆ విషయాన్ని గురించి అడిగితే ఏదో సమాధానం చెప్పాడు. రెండేళ్లు కష్టపడ్డాను. రూపాయి కూడా ఇవ్వలేదు .. ఇప్పుడు పేరు కూడా వేయలేదు అనే ఆలోచన రాగానే ఏడుపొచ్చేసింది.

అంతే... బాధ‌ను ఆపుకోలేక అలా ఏడ్చుకుంటూనే అన్నపూర్ణ స్టూడియోలో నుంచి బయటికి వచ్చేశాను అంటూ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త‌న‌కు జ‌రిగిన బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న‌ను బ‌య‌టపెట్టారు. ఇంతకీ అలా ఏడిపించిన డైరెక్టర్ ఎవరో చెప్పలేదు.