ఇంకా బతికివున్నానంటే అందుకు కారణం అదే : దర్శకుడు గౌతం మేనన్
కష్టాల్లో ఉన్నపుడు చిత్రపరిశ్రమలో ఎవరూ ఆదుకునేందుకు ముందుకురారని ప్రముఖ దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. చియాన్ విక్రమ్ హీరోగా 'ధృవనక్షత్రం' పేరుతో ఓ చిత్రాన్ని ఆయన సొంతంగా నిర్మించారు. కానీ అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. దీంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. దీంతో చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నారు. పైపెచ్చు, గత యేడాది చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.
'ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నేను తీసిన 'ధ్రువనక్షత్రం' విడుదల విషయంలో సమస్యల గురించి ఎవరూ స్పందించలేదు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నంచలేదు.
ఇండస్ట్రీ ఆ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఆ సినిమా గురించి కూడా ఎవరికీ తెలియదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే దీని గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. కానీ, కొన్ని సమస్యలు ఉన్నందున ఎవరూ దాన్ని స్వీకరించలేదు. విడుదల చేయడానికి ముందుకురాలేదు. ప్రేక్షకులు ఇంకా నా సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే నేను బతికి ఉన్నాను' అని అన్నారు.
'ఇది చాలా హృదయవిదారకంగా ఉంది. చిత్రం వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈవిషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నా' అని ఓ సందర్భంలో తెలిపారు.