బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌భీర్ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ షంషేరా. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ దత్, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. జూలై 22న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా రణ్‌భీర్ కపూర్ మాట్లాడుతూ షంషేరా వంటి డిఫరెంట్ సినిమాల కోసం నన్నెవరూ కలవలేదు. తొలిసారి ఈ అవకాశం దక్కింది. కరణ్ మల్హోత్రా గారు స్క్రిప్ట్ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేక్షకులు నన్ను చాలా డిఫరెంట్‌గా చూస్తారు. నిజంగా ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బల్లి, షంషేరా పాత్రలు వినగానే బాగా నచ్చటంతో రెండింటిని నేనే చేస్తానని దర్శక నిర్మాతలకు చెప్పాను. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను చేయడం హ్యాపీగా అనిపించింది. ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలంటే సరైన దర్శకుడు కావాలి. కరణ్ మల్హోత్రా దీనికి సూట్ అయ్యే దర్శకుడు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
సాధారణంగా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చిన్న కుర్రాడిగా, యువకుడిగా నటించాను. కానీ షంషేరా సినిమాలో బలమైన, మంచి సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా మెప్పిస్తాను. ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలంటే చాలా కన్విక్షన్, హార్డ్ వర్క్ అవసరం. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఇందులో చూపించే ఓ తెగ ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. ప్రత్యేకంగా నడుచుకుంటుంటారు. ఇవన్నీ పొట్రేట్ చేయాలంటే చాలా కష్టపడాలి. అలాంటి సినిమాను నా కెరీర్‌లో చేయటం చాలా లక్కీగా అనిపిస్తుంది. నేను రియల్ లైఫ్‌లో చాలా కూల్‌గా ఉంటాను. కోపం రాదు. కానీ సినిమాలో కోపం ఎక్కువగా ఉండే వ్యక్తిగా చేయాల్సి వచ్చింది. అది చాలా కష్టమైంది.
యాక్షన్ హీరో కనిపించడానికి చాలా కష్టపడ్డాను. ఆ ప్రాసెస్‌ను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగాను. మనం యాక్షన్ సినిమాలను చేస్తున్నప్పుడు అవి కథ, అందులోని ఎమోషన్స్‌కు తగినట్లు ఉండాలి. రాజమౌళిగారి సినిమాలు, పుష్ప ఇలా ఏదైనా బిగ్ ఇండియన్ కమర్షియల్ సినిమాలను గమనిస్తే.. అందులో ప్రతి యాక్షన్‌లో ఓ ఎమోషన్ కనిపిస్తుంది. అంతే కానీ ఏదో యాక్షన్ మాస్టర్‌ను పిలిచి ఫైట్ సీక్వెన్స్ చేయడం కాదు. షంషేరా సినిమాను 140 రోజుల పాటు చిత్రీకరించాం. అందులో 50-60 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకున్నాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సినిమాలు కావటంతో చాలా కేర్ తీసుకుని సినిమాను చేశాం.
సంజయ్ దత్‌గారు నా ఫేవరేట్ హీరో. ఆయనతో కలిసి ఈ సినిమాల నటించటంతో కల నేరవేరినట్లుగా అనిపించింది. సంజయ్‌దత్‌గారి లాంటి ప్రతి నాయకుడితో కలిసి నటించటం అంత సులభమేమీ కాదు. సంజయ్ దత్‌గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో పని చేసిన ప్రతి యాక్టర్ ఆయనతో ప్రేమలో పడిపోతాడు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయనంటే నాకెంతో ఇష్టం. అలాగే నేనంటే కూడా ఆయనెంతగానో ఇష్టపడతారు. సంజయ్ దత్‌గారు యాక్టర్‌గా డిఫరెంట్ సినిమాలు చేయాలని, అప్పుడే స్టార్‌గా ఎదుగుతావని ఎంకరేజ్ చేస్తుంటారు.
షంషేరాతో పాటు బ్రహ్మస్త్ర అనే మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాను. ఈ రెండు సినిమాలపై చాలా రోజులుగా వర్క్ చేస్తూ వచ్చాం. రెండింటికీ సంబంధం ఉండదు. ఆరు వారాల గ్యాప్‌లో రెండు పెద్ద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. కచ్చితంగా సినిమాలు ఆడియెన్స్‌కి నచ్చుతాయి.
షంషేరా వంటి పాత్రను చేయడానికి ప్రతి రోజు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కన్విక్షన్, హార్డ్ వర్క్ చేయడంతో పాటు సినిమాపై ఓ ప్యాషన్ ఉండాలి. సినిమాలో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. తన వారి కోసం పోరాటం చేసే నాయకుడి కథ ఇది. ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే తండ్రీ కొడుకు, తల్లీ కొడుకు మధ్య ఉండే ఎమోషన్స్ .. ఇలా అన్ని వేరియేషన్స్‌ను సినిమాలో చూస్తారు.
దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్‌ను గొప్పగా రిసీవ్ చేసుకుంటారు. అది చాలా గొప్పగా ఉంటుంది. నేను కూడా మంచి తెలుగు సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే షంషేరా సినిమా యూనివర్సల్ పాయింట్‌తో రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను అన్నారు.
దర్శకుడు కరణ్ మల్హోత్రా మాట్లాడుతూ షంషేరా సినిమా జర్నీ అనేది నిర్మాత ఆదిత్య చోప్రాగారిని కలిసిన తర్వాత మొదలైంది. ఆయన రెండు, మూడు లైన్స్ చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో షంషేరా లైన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. షంషేరా సినిమా చేయడానికి ఇన్‌స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. ఇదొక ఫిక్షనల్ కథ. 1871సంవత్సరంలో ఓ పర్టికులర్ ప్రాంతంలో జరిగే కొన్ని ఘటలను ఆధారంగా చేసుకుని సినిమా చేశాం. ఈ కథతో బేస్ చేసుకుని ఫిక్షనల్‌గా పాత్రలను, కథలను రూపొందించాం.
ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. 1870ల్లో దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయి. మనుషులు ఎలా ఉండేవారు అనే దానిపై కాస్త రీసెర్చ్ చేశాం. అంతే తప్ప.. షంషేరా ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ఎలాంటి రెఫరెన్సులు లేవు. మేం కొత్తగా క్రియేట్ చేసినవే. ఆడియెన్స్‌కు తప్పకుండా ఇది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమా అవుతుంది అన్నారు.
వాణీ కపూర్ మాట్లాడుతూ నేను ఇందులో పూర్తి స్థాయి యాక్షన్ హీరోయిన్‌గా కనిపించను. కానీ కొన్ని సన్నివేశాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. నా పాత్రలో చాలా లేయర్స్‌ను రేపు సినిమాలో చూస్తారు. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నమైనది. ప్రతికూల పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయిగా కనిపిస్తాను. కచ్చితంగా నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
యష్ రాజ్ సంస్థలో పనిచేయటాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను. ఎందుకంటే దీన్ని నా మాతృసంస్థగా భావిస్తాను. చాలా ప్రొఫెషనలిజం ఉంటుంది అన్నారు.
సంజయ్ దత్ మాట్లాడుతూ నటుడిగా ప్రతిసారి వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. రీసెంట్‌టైమ్ కె.జి.యఫ్ మూవీలో నేను చేసిన అధీర పాత్ర లార్జర్ దేన్ లైఫ్ రోల్. షంషేరా విషయానికి వస్తే ఇందులో శుద్ సింగ్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను. చాలా ప్రమాదకారి, కఠినంగా కనిపించే పాత్ర నాది అన్నారు.