శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 మే 2023 (15:25 IST)

నాగ్‌ అశ్విన్‌ సలహాలు పాటించా, నా నెక్స్ట్ సినిమాలో సమంత లేదు : దర్శకురాలు నందిని రెడ్డి

Nandini Reddy
Nandini Reddy
సమంతతో ఓ బేబీ చేసిన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా  సినిమా పై అంచనాలని పెంచాయి. మే 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నీ మంచి శకునములే చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం కథకు సోల్ లాంటిదని దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు.  అన్నీ మంచి శకునములే చిత్రం గురించి, ఇతర విషయాల గురించి దర్శకురాలు నందిని రెడ్డి ఇంటర్వ్యూ లో  పలు విషయాలు తెలియజేసారు.
 
ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ డ్రామా సినిమా కనుక లైన్‌ పెద్దగా వుండదు. అన్ని మంచి శుభశకునములే చిత్రాన్ని ఎలా కొత్త కోణంలో చూపించబోతున్నారు? మీకు ఛాలెంజ్‌ అనిపించిందా?
ఇది కొత్త పాయింట్‌ నో డౌట్‌ అందులో. రాయడానికి మంచి స్కోప్‌ వుంది. సంతోష్‌, మాళవికతోపాటు మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యత వున్న కథ ఇది. సహజంగా హీరో హీరోయిన్లకు ఫాదర్‌, మదర్‌ వుంటారు. బొమ్మరిల్లులో ప్రకాష్‌రాజ్‌ పాత్ర.. అన్నింటికీ ఇన్‌వాల్వ్‌ వుంటుంది. అలాగే అన్ని మంచి శుభశకునములే వచ్చేసరికి పాత్రలన్నీ తీసుకునే నిర్ణయాలకు కనెక్షన్‌ వుంటుంది. విక్టోరియా పురం అనే ఊరికథ. ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏమిటి? లవ్‌స్టోరీకి ఏమిటి సంబంధం? ఇలా అన్ని లింక్‌తోనూ వుంటాయి. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు వుండడం వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్‌.
 
హమ్‌ ఆప్‌కే హై కౌన్‌ సినిమాలో ప్రతి పాత్రా మనకు గుర్తిండిపోతుంది. ఆడియన్‌ కూడా కనెక్ట్‌ అవుతాడు. అంత కాకపోయినా ఈకథకు రైటింగ్‌ విషయంలో ప్రతి వారికి స్పేస్‌ ఇవ్వాలనేది చూసుకున్నాం. ఎవరూ వేస్ట్‌గావుండరు. అదే నాకు పెద్ద ఛాలెంజ్‌
విక్టోరియా పురం అనేది కథకు ఏమిటి సంబంధం?
ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో వున్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడ చెఫ్‌ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్‌ అయింది. కాఫీ ఎస్టేట్‌, రెండుకుటుంబాలు, నాలుగు జనరేషన్స్‌, కోర్టు కేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా వుంటుంది. 
 
సహజంగా ఫ్యామిలీ కథలు సక్సెస్‌ అయితే మాస్టర్‌ పీస్‌ అవుతుంది. గాడి తప్పితే బోర్‌గా ఫీలవుతారు? ఇందులో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
కథకు కావాల్సిన అంశాలు వుంటూ కథ జరిగే క్రమంలో అందరికీ ఎమోషన్‌ కనెక్ట్‌ అయ్యేలా వుంటాయి. దానితోపాటు ఎంటర్‌టైన్‌ చేశామాలేదా అనేది కూడా చూసుకుంటాను. అందుకే అన్ని పాత్రలతో అల్లుకు పోతూ అందరినీ మెప్పించే ప్రయత్నం నేను చేశా. ఓబేబీలో సెండాఫ్‌ కీలకం. ఇందులో అంతే. ప్రేక్షకుల్ని టచ్‌ చేస్తుంది. 
 
ఓ బేబీలో సమంత వుంది కాబట్టి ఎమోషన్‌ డీల్‌ చేసింది. ఈ సినిమాలో హీరోపై అంత ఎమోషన్‌ పెట్టడం ఎంతవరకు కరెక్ట్‌?
ఈ విషయంపై రేపు సినిమా విడులయ్యాక మీరే చెబుతారు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్‌ క్లయిమాక్స్‌ ఈ సినిమాకు రాశాను అనుకుంటున్నా. చివరి 20 నిముషాలు నా కెరీర్‌ ఆధారపడి వుంటుంది. ది బెస్ట్‌ అని చెప్పగలను. ఇప్పటికే 30మందికిపైగా బయటివారు సెన్సార్‌ వారూ చూశాక ది బెస్ట్‌ అన్నారు. మీరు సినిమా చూశాక హీరో పాత్రను ప్రేమిస్తారు. అలా అందరికీ కనెక్ట్‌ అయ్యేలా వుంటుంది. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా.
 
 విక్టోరియా పురం అనేది దేనికి స్పూర్తి ?
ఇది కేవలం కల్పితమే. ఏ సినిమాకూ కనెక్షన్‌ లేదు.
 
విక్టోరియా పురం ఐడియా ఎవరిది?
రైటర్‌ షేక్‌ దావూద్‌ ఐడియా ఇది. కథ అనుకున్నప్పుడు ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించాలని  క్రియేట్‌ చేశాడు. అలా వచ్చిన కథే ఇది. విక్టోరియాపురం ప్యాలెస్‌ కునూర్‌లో షూట్‌ చేశాం.
 
డ్రామా కామెడీ అనేది అర్బన్‌ సెటప్‌లో ఎలా డీల్‌ చేయగలిగారు?
ఇందులో పిల్లలు కూడా వున్నారు. హిల్  స్టేషన్‌లో వారి లైఫ్‌ ఎలా వుంటుంది. అక్కడ కాఫీ షాప్‌లు, మాల్స్‌ వుండవు. అయినా వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమిటి. అనేది సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్‌ చేస్తారు.
 
కోవిడ్‌ ముందు కథ రాసుకున్నారు గదా? ఆ తర్వాత ప్రేక్షకులు ఆలోచనలు మారాయి. అందుకు తగిన విధంగా మార్పులు చేశారా?
తప్పకుండా ప్రేక్షకులు ఆలోచనలు మారాయి. అందుకే కొన్ని మార్పులు జరిగాయి.  
 
ఈ సినిమాకు ముందు పెద్ద హీరోను అనుకున్నారని తెలిసింది. నిజమేనా?
అదేమీ లేదు. కథ చాలా సింపుల్‌గా వుంటుంది. సంతోష్‌ పాత్ర కూడా చాలా కూల్‌గా వుంటుంది. ఎవరితోనూ గొడవపడే రకంకాదు. అందుకే ఆయన్నే తీసుకున్నాం. హీరోను మార్చి పెద్ద రేంజ్‌లో తీయాలంటే కుదరదు. కథకు గౌరవం ఇవ్వాలి. లేదంటే దేనికీ న్యాయం చేయలేము.
 
 మిక్కీ జెమేయర్‌ సంగీతం ఎంతవరకు హెల్ప్‌ అయింది?
ఈ సినిమాకు మిక్కీనే సోల్‌. ఈ కథ చెప్పినప్పుడు నువ్వే సూపర్‌ స్టార్‌ అని చెప్పాను. క్లయిమాక్స్‌ రాసేటప్పుడు ఆ ఫీల్‌కు అనుగుణంగా నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఇందులో చివరిలో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ వుండదు. కానీ భూపాల్‌ నాలుగు పేజీల డైలాగ్స్‌ రాశాడు. కానీ కథ డిమాండ్‌ మేరకు వుంచాం. నిజాయితీగా క్లయిమాక్స్‌ వుండాలని చేసిన సినిమా. అందుకు మిక్కీ సంగీతం చాలా హెల్ప్‌ అయింది.
 
స్వప్న, ప్రియాగారు, అశ్వనీత్‌ దత్‌గారు, నాగ్‌ అశ్విన్‌ ఇంతమంది వుండడంతో మీ మేకింగ్ లో ఇంటర్‌ ఫియర్‌ అయ్యారా?
ఎవరూ ఇంటర్‌ ఫియర్‌ అవ్వలేదు. మా మధ్య ఎటువంటి క్లాష్‌లు లేవు. అందరూ కథ చర్చించుకుని ఔట్‌పుట్‌ వచ్చాక నాగీకి చూపిస్తే చిన్నపాటి సలహాలు ఇచ్చారు. అవి పాటించాం.
 
స్వప్నగారు ఇంతకుముందు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చారు. అందుకే ఈ సినిమాపై మీకు ఒత్తిడి వుందా?
తప్పకుండా వుంటుంది. వారు సక్సెస్‌ ఇచ్చారు. నేనూ సక్సెస్‌ ఇవ్వాలనే కసితో చేశాను. టెన్షన్‌  వుంటుంది. అయితే ఇప్పటివరకు చూసినవారంతా చెప్పిన ఫీడ్‌ బ్యాక్‌తో ఆ టెన్షన్‌ కూడా పోయి హ్యాపీగా వుంది. 
 
మీ సినిమాలన్నీ పెండ్లి నేపథ్యాలు వుంటున్నాయే?
కథకు అనుగుణంగానే చేస్తున్నాను. నాకూ ఆశ్చర్యంగానే వుంటుంది. పెద్ద హీరోలతో చేయాలని వుంటుంది. అయితే కథ డిమాండ్‌ మేరకే చేస్తున్నా. అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు చూసుకుంటే అలానే అనిపిస్తుంది. ఓ బేబీ తర్వాత కోవిడ్‌ వచ్చింది. ఆ టైంలో స్వప్నగారితో ఈ కథ కుదిరింది.
 
మీ తదుపరి సినిమాలో సమంతా వుంటుందా?
హీరోగా సిద్దు ఫిక్స్‌. సమంత అనుకోలేదు.
 
దర్శకులుగా గ్యాప్‌ రావడానికి కారణం వుందా?
నాకు స్క్రిప్‌ ను పూరీగారిలా స్పీడ్‌గా రాయడం కుదరదు. సోలో రచయితగా రాస్తున్నప్పుడుటైం పడుతుంది. అందుకే ఇప్పుడే రచయితల టీమ్‌ను పెట్టుకున్నాను. ఈ సినిమాకు నాకు మంచి శ్లాట్‌ దొరికింది. నాకు పెద్దగా గ్యాప్‌ అనిపించలేదు. ఎందుకంటే ఆ గ్యాప్‌లో కథలు రాసుకున్నా.
 
సింపుల్‌ కథ అన్నారు. రెండేళ్ళు ఎందుకు పట్టిందంటారు?
కోవిడ్‌ వల్ల 2 సంవత్సరాలు పట్టింది. 2019లోపిట్టకథలు చేశా. ఆ తర్వాత రెండేళ్ళు లాక్‌డౌన్‌. ఆ టైంలో కొన్ని లొకేషన్లకు పర్మిషన్‌ లేదు. కునూర్‌లోకొన్ని రూల్స్‌ వున్నాయి. ఆ తర్వాత అందరూ ఆర్టిస్టుల కాంబినేషన్‌ కుదరాలి. యు.ఎస్‌., యూరప్‌లో చేయడానికి పర్మిషన్‌ రాలేదు. ఇలా టైం పట్టింది.
 
కోవిడ్‌ తర్వాత ఓటీటీ పుంజుకుంది దాంతో కథల్లో మార్పు వచ్చింది. మీకు ఛాలెంజ్‌ అనిపించిందా?
రొటీన్‌గా కథలు చెప్పకుండా వుండడమే దానికి పరిష్కారం. అందుకే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఊహించని విధంగావుండేలా రాస్తున్నాను. జాతిరత్నాలు, బలగం వంటి సినిమాలు వచ్చాయంటే చిన్న పాయింట్‌ అయినా కుటుంబమంతా కలిసిచూసి ఎంజాయ్‌ చేసేలా వుంది. అందుకే అలాంటి కథలు వుంటే ఓటీటీనుంచి బయటకు వచ్చి థియేటర్‌లో చూస్తారు. ఆ ప్రయత్నమే నా సినిమా.
 
 ఇప్పుడు ఏ సినిమాకూ మార్నింగ్‌ షోకు ప్రేక్షకులు రావడంలేదు. ఈ ప్రభావం మీ సినిమాకు వుంటుందనుకుంటున్నారా?
నా మొదటి సినిమా అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు మార్నింగ్‌ షోకు పెద్దగా ప్రేక్షకులు లేరు. తర్వాతర్వాత మౌత్‌ టాక్‌తో విపరీతంగా వచ్చి చూశారు.
 
అన్నీ ఫ్యామిలీస్‌ పెండ్లి కథలేనా? కొత్తవి ఏమైనా చేస్తున్నారా?
నా నెక్ట్స్‌ చిత్రం ఊహించని కథతో రాబోతున్నా.  వినూత్నంగా వుంటుంది. అన్నారు.