దృశ్యం2 తెలుగులో వర్కవుట్ అవుతుందా!
తన కుమార్తె, భార్యపైన కూడా అనుచితంగా, వికృతంగా ప్రవర్తించిన పోలీసు అధికారిణి కొడుకును ఆ కుటుంబం హత్యచేసి దాన్ని మరుగుపరుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిశోధనలో నిజం తెలిసినా హత్యచేసిన మోహన్‌లాల్ తెలివిగా బయటపడతాడు. ఇది దృశ్యం సినిమా కథ. మలయాళంలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ అయిన దృశ్యంను ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు దృశ్యం-2 మలయాళంలో ఓటీటీలో విడుదలైంది. ఈ కథను దర్శకుడు జీతు జోసెఫ్ నిజ సంఘటన ఆధారంగా రాసుకున్నాడు. అందులో హత్యచేసిన వ్యక్తి దొరికిపోతాడు. కానీ దొరక్కపోతే ఎలా వుంటుందనేది తను రాసుకున్న కథ. ఇప్పుడు దృశ్యం2లో హత్యచేసిన శవాన్ని ఎక్కడ దాచాడో చెప్పమని పోలీసు అధికారిణి తన డిపార్ట్‌మెంట్ వారితో ఎంక్వయిరీ చేయిస్తుంది. ఆఖరికి పలానా చోట దాచాడు అని తెలిసినా అక్కడ దొరకదు. చివరికి ఎంక్వయిరీలో మోహన్‌లాల్ కుటుంబాన్ని పోలీసులు చితకబాదుతారు. అయినా నోరు మెదపరు. చివరికి వారు ఏమీ చేయలేక వదిలేస్తారు. ఫైనల్‌గా ఆ బాడీని మోహన్‌లాల్ ఎక్కడ దాచాడు అనేది కథ. ఈ సినిమా చూస్తే దీనికి కొనసాగింపుగా 3వ భాగం కూడా తీయవచ్చు.
కానీ మొదటి భాగంలో సగటు కుటుంబం ఆడపిల్ల పడే అవమానం, సమాజంలో వున్న అభద్రతపై వుంటూ సస్పెన్స్‌గా సాగుతుంది. దానితో అందరికీ కనెక్ట్ అయింది. కానీ రెండో భాగంలో కేవలం శవాన్ని ఎక్కడ దాచాడో అనే దానిపైనే కథనం సాగడం అనే దానిలో ఎక్కడా ఆసక్తి కలిగించలేదు. కానీ మలయాళంలో హిట్ అయిందనే టాక్ వచ్చింది. దాంతో తెలుగులో కూడా వెంకటేష్‌తో తీయాలని నిర్ణయించుకున్నారు. లాజిక్ ప్రకారం చూస్తే, ఉన్నత పోలీసు అధికారిణి కొడుకును హత్యచేస్తే అందుకు కారణం తెలుసుకుని తప్పు తన కొడుకుదేనని గ్రహిస్తుంది. అందుకు అధికారిణి భర్తకూడా ఏమీ మాట్లాడడు. కానీ రెండో భాగంలో శవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో దర్శకుడు అల్లిన కథే ఈ సినిమా. లాజిక్‌గా చూస్తే ఇప్పటి టెక్నాలజీ ప్రకారం మెటల్‌డిక్టేటర్ లాంటి వాటితో నిందితుడిని నుంచి నిజం బయటకు రప్పించవచ్చు. అలాంటి ప్రయత్నం చేయకుండా మూస ధోరణిలో ఏదో టెంపో మెయింటెన్ చేస్తూ తీసిన సినిమా దృశ్యం2. మరి మొదటి భాగంలో వున్న కనెక్టవిటీ రెండో భాగంలో ప్రేక్షకులు అవుతారా! అనే సందేహం తెలుగులో వుంది. దీనిపై మరింత కసరత్తు చేసి సెట్‌పైకి వెళ్ళాలనే ఆలోచనలో తెలుగు నిర్మాతలు వున్నారు. అందుకు దర్శకుడు కాస్త కథను మార్చనున్నట్లు సమాచారం.