శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (09:21 IST)

కాశ్మీర్‌లో 30 యేళ్ల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు

cinema hall
కాశ్మీర్‌లో మూడు దసాబ్దాల తర్వాత సినిమా థియేటర్ల తలుపులు తెరుచుకున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన మూడు స్క్రీన్‌‍లో మల్టీప్లెక్స్‌ను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం హెచ్చుమీరిపోవడంతో గత 1990 దశకంలో థియేటర్లు మూతపడ్డాయి. నిజానికి గత 1980 వరకు ఆ రాష్ట్రంలో థియేటర్లు నడిచేవి. కానీ, ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా 1990 నుంచి థియేటర్లను మూసివేశారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎల్జీ కృషి ఫలితంగా ప్రభుత్వమే ఈ మల్టీప్లెక్ థియేటర్‌ను నిర్మించి ప్రారంభించింది. ఫలితంగా మూడు దశాబ్దాల తర్వాత కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. 
 
ఆదివారం పుల్వామా, సోపియాలలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చారిత్రాత్మకమన్న ఆయన.. ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా, సోపియా యువతకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు.
 
జమ్మూకశ్మీర్‌లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్ట్వార్, రియాసీలలో ఇవి ప్రారంభంకానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతోపాటు ఇన్ఫోటైన్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. 
 
అలాగే వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో "ఆర్ఆర్ఆర్", "భాగ్ మిల్కా భాగ్"లను ప్రారంభించారు. మరో స్క్రీన్ మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో "లాల్ సింగ్ చడ్డా" చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.