చిత్ర నిర్మాణంలోనూ చెరగని ముద్ర వేసిన కైకాల
కేవలం నటనా పరంగానే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ సీనియర్ నటుడు కైకాల సత్యనారయణ చెరగన ముద్రవేశారు. రమా ఫిలిమ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన.. తొలుత 'గజదొంగ', 'ఇద్దరు దొంగలు', 'కొదమ సింహం', 'బంగారు కుటుంబం', 'ముద్దుల మొగుడు' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మరికొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
సత్యనారాయణ తన కెరీర్‌లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారు. దాదాపు 200మంది దర్శకులతో పనిచేశారు. అభిమానులు, కళా సంస్థలు సత్యనారాయణ నటనను మెచ్చి ఎన్నో బిరుదులు ఇచ్చాయి. 'కళా ప్రపూర్ణ', 'నవరస నటనా సార్వభౌమ' ఇలా ఎన్నో అందుకున్నారు.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక సత్యనారాయణ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తెలుగుదేశం తరపున 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, కొంతకాలం పాటు ప్రజాసేవ చేశారు.