మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (15:52 IST)

కళ్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే'కు 'డిపాజిట్లు' గల్లంతేనా?.. #MLAMovieReview

నందమూరి ఫ్యామిలీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి). కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించారు.

నిర్మాణ సంస్థ‌లు: బ‌్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
తారాగ‌ణం: న‌ంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిబొట్ల‌
నిర్మాత‌లు: కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: ఉపేంద్ర మాధ‌వ్‌
 
నందమూరి ఫ్యామిలీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం "ఎమ్మెల్యే" (మంచి లక్షణాలున్న అబ్బాయి). కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
 
నిజానికి కళ్యాణ్ రామ్ ఒక వైపు హీరోగా నటిస్తూన.. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాను నిర్మాతగా మారి తీసిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం కళ్యాణ్ రామ్‌కు భారీ మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో తన తాజా చిత్రం 'ఎమ్మెల్యే'. ఈ చిత్ర కథ ఏవిధంగా ఉందన్న విషయంపై ఆరా తీద్దాం. 
 
క‌థ‌: 
అనంత‌పురం జిల్లాలో వీర‌భ‌ద్రపురంలో నాగ‌ప్ప‌(జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి), గాడ‌ప్ప(ర‌వికిష‌న్‌) కుటుంబాల మ‌ధ్య త‌రాలుగా రాజ‌కీయ వైరం ఉంది. ఈ వైరంలో ప్ర‌తిసారి గాడ‌ప్ప కుంటుంబ‌మే నెగ్గుతూ వ‌స్తుంటుంది. సంప్ర‌దాయప‌రంగా మ‌రోసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో గాడ‌ప్ప విజ‌యం సాధించి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఊరి పిల్ల‌ల‌ను స్కూలుకి పంప‌కుండా త‌న గాజు ఫ్యాక్ట‌రీలో ప‌నిచేయిస్తూ.. వారికి సిలికోసిస్ అనే వ్యాధి రావ‌డానికి కూడా గాడప్ప కారణమవుతాడు. దాంతో గాడ‌ప్ప చేసే అక్ర‌మ దందాల‌పై ఓ జ‌ర్న‌లిస్ట్ ఆధారాలు సేక‌రించకా, ఆ విలేఖరిని గాడప్ప, అతని మనుషులు చంపేస్తారు. అక్క‌డి నుండి క‌థ హైద‌రాబాద్‌కి మారుతుంది. 
 
హైద‌రాబాద్‌లోని క‌ల్యాణ్‌(నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌) త‌న తండ్రిని కాద‌ని.. త‌న చెల్లెల‌కి.. ఆమెకిష్ట‌మైనవాడు(వెన్నెల‌కిషోర్‌)తో పెళ్లి జరిపిస్తాడు. దీంతో ఇంటి నుంచి తండ్రి వెళ్లగొడతాడు. ఫలితంగా తన బావ‌, చెల్లితో క‌లిసి బెంగ‌ళూరుకి వెళతాడు కళ్యాణ్. అక్క‌డ ఇందు( కాజ‌ల్ అగ‌ర్వాల్‌)ను చూసి ప్రేమలో పడిపోతాడు.. త‌న బావ కంపెనీలోనే కళ్యాణ్ ఉద్యోగం సంపాదిస్తాడు. త‌న కంపెనీకి ఛైర్మ‌న్ కూతురు.. కంపెనీ ఎం.డియే ఇందు అని తెలుసుకుని షాక్ తింటాడు. కానీ ఇందుని ప్రేమిస్తున్నాన‌నే చెబుతాడు. అలాంటి స‌మ‌యంలో కంపెనీకి ఓ స‌మ‌స్య వ‌స్తుంది. క‌ల్యాణ్ ఆ స‌మ‌స్య‌ను తన తెలివితేటలతో చాకచక్యంగా పరిష్కరిస్తాడు. 
 
అక్కడే క‌థ‌లో ట్విస్ట్ మొద‌ల‌వుతుంది. ఇందు త‌న ఛైర్మ‌న్ కూతురు కాద‌ని.. గాడ‌ప్ప పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనే నిజం తెలుస్తుంది. దాంతో క‌ల్యాణ్ ఏం చేస్తాడు? త‌న కూత‌ురుని పెళ్లి చేసుకునే అబ్బాయి ఎమ్మెల్యేగా ఉండాల‌ని నాగ‌ప్ప పెట్టే కండీష‌న్‌ను దాటి ఇందుని కల్యాణ్ ఎలా సొంతం చేసుకుంటాడు? క‌ల్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా? అనేది మిగిలిన కథ. 
 
విశ్లేష‌ణ‌: 
ఈ చిత్రంలో పాత్రల తీరుతెన్నులను పరిశీలిస్తే. కళ్యాణ్ రామ్ లుక్ ప‌రంగా కొత్త‌గా ఉన్నాడు. బ‌రువు త‌గ్గ‌డం.. కాస్ట్యూమ్స్ విష‌యంలో తీసుకున్న శ్ర‌ద్ధ కార‌ణంగా ఆ కొత్త‌దనం మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ఇక క‌ళ్యాణ్ రామ్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. కాజ‌ల్ లుక్స్ ప‌రంగా చూడ‌టానికి అందంగా కనిపించినా, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో మ‌రో ప్రధాన పాత్ర విల‌న్ ర‌వికిష‌న్‌. సినిమా ప్ర‌థ‌మార్థంలో అంద‌రూ భ‌య‌ప‌డేలా ఉండే విల‌న్ సెకండాఫ్‌కి వ‌చ్చేసరికి ఓ జోక‌ర్‌లా మారిపోతాడు. దీనికి కారణం హీరో విలన్‌ను ఆటపట్టించడమే. అంటే ర‌వికిష‌న్ విల‌నిజాన్ని స‌రిగ్గా వాడుకోలేద‌నిపించింది.
 
ఇక సినిమాలో ఫ‌స్టాఫ్‌లో పోసాని కంపెనీ ఎండి పాత్ర‌లో అమ్మాయిల‌ను ట్రాప్ చేసే వ్య‌క్తి. పోసానికి, క‌రాటే క‌ళ్యాణికి మ‌ధ్య జ‌రిగే కామెడి, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. అజ‌య్‌, క‌ల్యాణ్ రామ్‌, బ్ర‌హ్మానందం కామెడీ ట్రాక్ చాలా సిల్లీగా క‌న‌ప‌డుతుంది. ఇక సెకండాఫ్‌కు వ‌చ్చేస‌రికి సినిమా అంతా గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఆ గొడ‌వ‌లు కూడా ఇంత‌కు ముందు చూసేసిన సినిమాల్లోని సన్నివేశాల‌ను త‌ల‌పించేలా సాగాయి. పొంత‌న లేని స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌లో సుత్తితో కొడితే టైర్లు ఊడిపోవ‌డం.. అప్ప‌టివ‌ర‌కు తమ పిల్ల‌ల గురించి ప‌ట్టించుకోకుండా మందే లోకంగా బ్ర‌తికే గ్రామ ప్ర‌జ‌లు హీరో మాట‌లు విని మారిపోవ‌డం.. ఇలా ఒక‌టేమిటి అంతా నమ్మశక్యంగాని లాజిక్‌లేని సీన్స్‌తో బోర్ కొట్టిస్తుంది. 
 
ఇక ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ క‌థ ప‌రంగా ఏమాత్రం కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌లేదు. అన్ని క‌థ‌ల‌ను మిక్సీలో వేసుకుని క‌లిపి కొట్టి ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేసి ఆక‌ట్టుకోవాల‌నుకునే ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్ములా వ‌ర్కౌట్ అయితే ఓకే.. కాక‌పోతేనే బోరింగ్ ఫార్ములా అయిపోతుంది. ఇక్క‌డ జ‌రిగింద‌దే. ఇక మ‌ణిశ‌ర్మ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకోలేదు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్రతి సీన్ రిచ్‌గా క‌న‌ప‌డింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. కథే లేదు. అంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాలంటే క‌థ‌ను మ‌రిచిపోకూడ‌దు. ఎన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించినా సినిమాను న‌డిపించేది క‌థే.. ఆ సంగ‌తిని గుర్తుపెట్టుకోవాలి. మొత్తంమీద కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేలు డిపాజిట్లు దక్కేలా కనిపించడం లేదు.