కమల్ హాసన్ - రజనీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ!!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఇందులో అగ్ర నటులు కమల్ హాసన్, రజనీకాంత్‍లు కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా వెల్లడించారు. ఈ వార్త నిజమైతే వారిద్దరూ దాదాపు 46 యేళ్ల తర్వాత కలిసి వెండితెరపై కనిపించనున్నారు.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి అభిమానులు సంబరపడుతున్నారు. తాజాగా దుబాయ్ వేదికగా సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో కమల్ హాసన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, 'మీరు, రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ఆశించవచ్చా' అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. 'ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే మంచిదే కదా... వారు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, ఇన్ని రోజులు అది కుదర్లేదు. త్వరలోనే మీ ముందుకు కలిసి రానున్నాం. అది మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది' అని స్పష్టంచేశారు. దీంతో ఈ బిగ్ మల్టీస్టారర్ అధికారికమైంది. అయితే, ఈ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం ఆయన పంచుకోలేదు.
అదేసమయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై కూడా కమల్ స్పందించారు. "మా మధ్య ఎలాంటి భేదాలు లేవు. ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే. మేం ఎప్పుడూ ఒకరికి ఒకరం పోటీ అనుకోలేదు. మేమిద్దరం కలిసి నటించేందుకు అవకాశం కోసం ఎదురుచూశాం. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలని కూడా ప్రయత్నం చేశాం" అని కమల్ హాసన్ తెలిపారు.