మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:08 IST)

కేసీఆర్ బయోపిక్‌కు అడ్డంకులు.. యూట్యూబ్‌లో విడుదల..

టాలీవుడ్‌లో బయోపిక్‌లకు కష్టకాలం మొదలైనట్లుంది... మొన్నటికి మొన్న లక్ష్మీపార్వతిని మదర్ థెరిస్సాలా చూపించేస్తూ... విలక్షణ దర్శకుడు ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలకు నోచుకోకపోగా... తాజాగా తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ సినిమాకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 
 
ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడిన ఈ సినిమా నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ... గత నెల 29నే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నామనీ, కానీ కొందరు అడ్డంకులు సృష్టించారనీ, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను బెదిరించారని ఆరోపించారు. దీంతో ఈ సినిమాను యూట్యూబ్, టీవీ చానళ్లలో ఉచితంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనీ, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషిని ఈ ‘ఉద్యమ సింహం’లో చూపించే ప్రయత్నం చేసామని చెప్పుకొచ్చారు. 
 
అయితే, ఇప్పుడు ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటూండడంతో కాపీ రైట్ సమస్య లేకుండా ఎవరైనా తమ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసుకునేలా సినిమాను ఉచితంగా విడుదల చేస్తున్నట్టు నాగేశ్వరరావు తెలిపారు. మరి ఇదే జరిగితే... మరి నిర్మాతకు ఇది మాత్రం నష్టం కాదా??  ఆయనకే తెలియాలి.