మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (10:47 IST)

ఎన్టీఆర్ బయోపిక్ : ఎక్కడి నుంచి తీయాలో ఎక్కడ ఆపాలో తెలుసు : బాలకృష్ణ

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం గురించి ఆ చిత్ర నిర్మాత, హీరో బాలకృష్ణ స్పందించారు. ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి తీయాలో ఎక్కడ ఆపాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చిత్ర

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం గురించి ఆ చిత్ర నిర్మాత, హీరో బాలకృష్ణ స్పందించారు. ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి తీయాలో ఎక్కడ ఆపాలో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించడం అదృష్టమన్నారు. ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించిందని బాలకృష్ణ అన్నారు. తాను తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్‌కు క్రిష్ న్యాయం చేయగలడనే నమ్ముతున్నట్టు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని చెప్పారు. భవిష్యత్ తరాలకు గుర్తుండేలా సినిమాను రూపొందిస్తామని అన్నారు.
 
ఆయన విజయవాడలో జరుగుతున్న టీడీపీ మహానాడులో మాట్లాడుతూ, ఎన్టీఆర్ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు చరిత్రపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి తొలుత తేజ దర్శకత్వం వహించేందుకు ముందుకువచ్చారు. కాగా అనివార్య కారణాల వల్ల తేజ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో పలువురు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ చివరకు బాలకృష్ణతో "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని తీసిన డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు బాలయ్య ప్రకటించారు. 
 
మరోవైపు, విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో జరుగుతున్న మహానాడు రెండో రోజు సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ ప్రధానాకర్షణగా నిలిచారు. తొలిరోజు సమావేశాలకు హాజరుకాలేకపోయిన ఆయన, రెండో రోజు సమావేశం ప్రారంభానికి ముందే సభాస్థలికి చేరుకోగా, అభిమానులు, కార్యకర్తలు బాలయ్యను పలకరించేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. బాలకృష్ణ సైతం వారితో ఆప్యాయంగా మాట్లాడారు.