నేడు 'మా' కార్యవర్గం ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం శనివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే మా అధ్యక్షుడుగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు కొత్త మా కార్యవర్గం నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది.
నిజానికి ఏ ఎన్నికల్లో అయినా గెలిచిన అభ్యర్థులు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాతే తమ పదవి బాధ్యతలు చేపడతారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వారు ఆ పదవిలో ఉన్నట్లు భావించాలి. కానీ మంచు విష్ణు ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. ముందుగా ఆయన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ కోర్టు మెట్లెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామల మధ్యే శనివారం మా కొత్త కార్యకర్గం కొలువుదీరనుంది. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా మంచు విష్ణు ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. కోటా శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణతో పాటు కొందరు సీనియర్ నేతల వద్దకు మంచు విష్ణు స్వయంగా వెళ్లి కలిశారు.
మరికొందరికి ఫోన్ కాల్ చేసి ఆహ్వానించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులకు కూడా ఫోన్ కాల్ చేసి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి చిత్రపరిశ్రమలో పెద్దగా ఉన్న చిరంజీవికి మాత్రం ఆహ్వానం వెళ్లలేదన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.