శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (14:13 IST)

కరోనాలా ఇదేమైనా కొత్త జబ్బా..? జగన్‌కు కౌంటరిచ్చిన మాధవీలత

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల్లో దేవతా విగ్రహాల ధ్వంసంపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత స్పందించారు. హిందువులందరూ మేల్కోవాలని పిలుపునిచ్చారు. జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి విగ్రహాల ధ్వంసం జరుగుతోందన్నారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే జగన్ సర్కార్‌పై మాట్లాడాల్సి వస్తోందన్నారు. 
 
హిందూ దేవుళ్లపైనే దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మతిస్థిమితం లేని వారి పని అంటూ సాక్షాత్తు సీఎం జగన్ వ్యాఖ్యానించారని, వారికి ఇతర మతాలు కనపడటం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగడమనేది.. కరోనాలా ఇదేమైనా కొత్త జబ్బా.. అని ఎద్దేవా చేశారు.
 
ఏడాదిన్నరగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే.. నిందితులను పట్టుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 122 చోట్ల ఆలయాల్లో దాడులు జరిగాయని, కేవలం హిందూ దేవాలయాలపైనే దాడులు జరగడం ఏంటని ప్రశ్నించారు. తనపై సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తున్న నోళ్లన్నీ హిందువులవేనన్న ఆమె.. హిందూ ధర్మం లేకుండా చేద్దామని అరాచకశక్తులు అనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తాను హిందువునని, తన ఆలోచనలు సాంస్కృతికంగా ఉంటాయన్నారు. తాను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి.. తన వస్త్రధారణ సంప్రదాయంగా ఉండదని చెప్పుకొచ్చారు. నుదుటన అంత పెద్దబొట్టు పెట్టుకొంటేనే హిందువు కాదన్నారు.