మహేష్‌తో పోటీపడనున్న ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ మే నెలాఖరుకి కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. 2021లో జనవరి 8న ఆర్ఆర్ఆర్ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు వీరిద్దరూ పోటీపడనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి మహేష్ తో మహర్షి అనే విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో వీరిద్దరూ కలిసి చేయనున్న తాజా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్ బాబు డాన్ గా, లెక్చరర్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ అనే సినిమా చేయడం.. ఆ సినిమా విజయం సాధించడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఈ సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 2021 సమ్మర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు.
మహేష్ - వంశీ పైడిపల్లి మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ 2021 జనవరి 8న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది కాబట్టి 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే... ఎన్టీఆర్-త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమాని కూడా 2021 సమ్మర్‌లోనే రిలీజ్ చేయనున్నారు.
సో.. 2021 సమ్మర్లో మహేష్, ఎన్టీఆర్ మధ్య పోటీ తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. మహేష్, ఎన్టీఆర్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి.. మహేష్, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి పోటీ లేకుండా డేట్స్ అడ్జెట్స్ చేసుకుంటారా..? లేక 2021 సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద పోటీపడతారో చూడాలి.