మేజర్‌కు ప్రేక్షకులు ఫిదా: కన్నీటిపర్యంతమైన సందీప్ తల్లిదండ్రులు.. అడవిశేష్ ఆలింగనం (video)
మేజర్ సినిమాకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో రూపొందిన చిత్రం మేజర్‌ను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. విడుదలైన రోజునే ఓ బయోపిక్ పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం సామాన్య విషయం కాదని సినీ పండితులు అంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క రూపొందించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను చూసి రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయం తెలిపారు.
సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారని కితాబిచ్చారు. చాలా మంచిగా సందీప్ కథను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారని తెలిపారు.
ఇంకా మాట్లాడుూ.. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. సందీప్ చనిపోలేదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అదే విధంగా ఆయన ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తాడు. మేజర్ సినిమా చూస్తే యువతరం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని.. దేశానికి సేవ చేసేందుకు ముందుకు వస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు
ఇంకా తన కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు మై బాయ్స్ మేజర్ టీమ్‌తో మంచి సమయం గడుపుతున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.." అని సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ పేర్కొన్నారు.
మేజర్ సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్ తల్లిని అడవి శేష్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'అంకుల్, అమ్మ మీ ఇద్దరి కోసం మేజర్ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.