గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 10 జూన్ 2019 (21:32 IST)

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ తొలి ప్ర‌య‌త్నంలోనే రిస్క్ చేస్తున్నాడా..?

మెగాస్టార్ మేన‌ల్లుడు, సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం ఉప్పెన‌. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న‌ కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సరిగమ అనే కన్నడ సినిమా ద్వారా వెండి తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తరువాత తమిళ సినిమాల్లో న‌టించింది. ఉప్పెన చిత్రంతో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. 
 
ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ వైవిధ్య‌మైన చిత్రం ప్రస్తుతం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్‌ మరో 30 రోజులు అక్కడే కొనసాగుతుంది. 
 
ఆ త‌ర్వాత‌ గ్యాంగ్‌టాక్, సిక్కిం ప్రాంతాల్లో 20 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారు. ఇక్కడ ఓ 20 రోజులు షూటింగ్‌ చేయనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌వుతుందని తెలిసింది. శ్యామ్‌ దత్‌ సైనుద్దీన్‌ కెమెరామేన్‌గా ఉన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
ఉప్పెన క‌థ ఓ ప్ర‌యోగం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవ‌రైనా తొలి సినిమాకి ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఎంచుకుంటారు కానీ... వెరైటీగా ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని ఎంచుకున్నాడు. ఇది ఒక ర‌కంగా రిస్కే. మ‌రి.. ఈ ప్ర‌యోగం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో..?