మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (15:24 IST)

మహిళా సాధికారత నేపథ్యంలో మిమో చక్రవర్తి, సాషా చెత్రి సినిమా నేనెక్కడున్నా

Mimo Chakraborty, Sasha Chettri
Mimo Chakraborty, Sasha Chettri
సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్, బ్రహ్మజీ, ప్రేమ్ రక్షిత్ వీడియో బైట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
గోపీనాథ్ రెడ్డి ఐఏఎస్ మాట్లాడుతూ, పత్రికా రంగంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలను వారు ఎదుర్కొవడం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి పత్రికా రంగం. అలాంటి రంగంలోని వ్యక్తికి సమస్య వస్తే? అనే దానికి జవాబు చూపిస్తూ... మరోవైపు స్త్రీ శక్తికి మనం అవకాశం ఇస్తే, ఎలా ఆకాశం అంత ఎత్తు ఎదుగుతుందో? అనే విషయాన్ని కూడా మాధవ్ ఇందులో చూపించారని తెలిసింది. మాధవ్ మరిన్ని గొప్ప చిత్రాలను చేయాలని ఆకాంక్షిస్తున్నాన''ని తెలిపారు. 
 
Nenekkadunna pre release event
Nenekkadunna pre release event
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్‌తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్‌తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఒకప్పుడు చంపేసేవారు. ఆడపిల్ల సబల కాదు అబల అనుకునేవారు. కానీ పెంపకం చక్కగా ఉంటే, ఆడపిల్ల ఏ స్థాయికైనా వెళుతుందనే నేపథ్యంలో ఈ కథని సిద్ధం చేశారని తెలిసింది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఆర్టిస్ట్‌ల పేర్లు చేస్తుంటే భయమేస్తుంది. అలాంటి నటీనటులు ఇందులో ఉన్నారు. అంత పెద్ద స్టార్ నటీనటులను మాధవ్ ఎలా డీల్ చేశాడు? అనేదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి, గోపీనాధ్ రెడ్డి చెప్పినట్లుగా సక్సెస్ మీట్‌కు కూడా మమ్మల్ని పిలవాలని కోరుకుంటున్నాన''ని అన్నారు.
 
బీజేపీ మోర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ... ''మహిళా సాధికారత అని అంటుంటాం. అది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారనేది టీజర్, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. మహిళా ప్రధాన నేపథ్యం ఇటువంటి సినిమా చేసిన టీమ్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నారు.
 
హీరోయిన్ సాషా చెత్రి మాట్లాడుతూ... ''అందరూ సమయం కేటాయించి ఈ వేడుకకు వచ్చినందుకు థ్యాంక్యూ. డైరెక్టర్ మాధవ్ గారికి ధన్యవాదాలు. చాలా గొప్ప సినిమా ఇది. మహిళలపై ఇలాంటి సినిమా, నేను ప్రధాన పాత్రలో నటించడం అంతా డ్రీమ్‌లా ఉంది. చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. నేను ఈ దేశానికి చెందిన బిడ్డను, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 
 
హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ... ''ఈ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఫిబ్రవరి 28న విడుదలకాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. అందరూ చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్‌ గారు. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 28న వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాన''ని అన్నారు.
 
చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ... ''మా తల్లిదండ్రులు జన్మ ఇస్తే, నాకు దర్శకుడిగా పునర్జన్మ ఇచ్చింది కేబీఆర్. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తీశాం. నాకు తెలిసిన స్ట్రాంగ్ మహిళ మా అమ్మ. ఆడవాళ్లకు స్వేచ్ఛ ఇస్తే ఆకాశమే హద్దు అనేరీతిలో తమ ప్రతిభ చూపిస్తారు. వాళ్ళ గొప్పదనం చాటి చెప్పేలా జర్నలిజం నేపథ్యంలో సినిమా చేశాం. మిమో త్వైకాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. యాక్షన్ సీన్స్ ఇరగదీశారు. సాషా కూడా బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో కంటతడి పెట్టించారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ గారు తన నేపథ్య సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లారు. ట్యాలెంటెడ్ టెక్నీషియన్లు పని చేశారు. అందరూ సినిమాను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.