శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

బిగ్ బాస్ నాలుగో సీజన్... ఫినాలేకు లవ్ స్టోరీ కపుల్స్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆదివారంతో పూర్తి కానుంది. బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌ ఫైనల్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు స్టార్ మా నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగులో మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ తుది దశకు చేరుకుంది. డిసెంబర్ 20న ఈ కార్యక్రమం ఫినాలే జరగనుంది. 
 
ఈ ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు అవుతారని ఓ ప్రచారం నడుస్తుండగా, మెహరీన్‌, లావణ్య త్రిపాఠి వంటి అందాల భామలు ఈ స్టేజ్‌పై తమ డ్యాన్స్‌తో అదరగొట్టనున్నట్టు టాక్.
 
దసరా స్పెషల్ ఎపిసోడ్ రోజు నాగార్జున తనయుడు అఖిల్ బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రమోషన్ చేసుకుంటూనే హౌజ్‌మేట్స్‌తో సందడి చేశాడు. ఈ ఫినాలేకు నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్య తన తాజా చిత్రం లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్‌పైకి రానున్నట్టు సమాచారం. సాయి పల్లవితో కలిసి చైతూ సందడి చేయనున్నాడని వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.