హెడ్లైన్స్ కోసం విడాకుల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తారా? మీడియాపై నాగ చైతన్య ఫైర్
కొన్ని మీడియా సంస్థలు హెడ్‌లైన్స్ కోసం తమ విడాకుల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నాయని, ఇకనైనా విడాకుల అంశాన్ని ప్రస్తావించడం మానుకోవాలని హీరో నాగ చైతన్య హితవు పలికారు. ఆయన నటించిన కొత్త చిత్రం "కస్టడీ". ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో నాగ చైతన్య మాట్లాడారు.
హీరోయిన్, తన మాజీ భార్య సమంతతో విడాకులు, తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడారు. కోర్టు విడాకులు మంజూరు చేసి సంవత్సరమైనా ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్నే హైలైట్ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
'నా సినిమాల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఓకే. కానీ, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మాత్రం బాధపడతాను. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. కానీ, నాకు నా జీవితంలోని ఆ దశ అంటే ఎంతో గౌరవం ఉంది. గత రెండేళ్లుగా మీడియాలో ఈ విషయంపై వస్తున్న రూమర్స్ వల్ల ఆ గౌరవాన్ని తీసేస్తున్నారు.
ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. మాకు కోర్టు విడాకులు మంజూరు చేసి సంవత్సరం పైన అవుతుంది. ఇంకా ఇదే విషయాన్ని సాగదీస్తున్నారు. మా ఇద్దరితో పాటు ప్రమేయం లేని మూడో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారు. వాళ్ల కుటుంబం ఎంత బాధపడుతుందని ఆలోచించడం లేదు. నేను, సామ్ మా విడాకుల విషయంపై స్టేట్‌మెంట్ ఇచ్చాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను' అని నాగ చైతన్య అన్నారు.