1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (18:40 IST)

మత్స్యకారుని పాత్ర కోసం శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామం సందర్శించిన నాగ చైతన్య

Naga Chaitanya in K.Matsyalesam village
Naga Chaitanya in K.Matsyalesam village
ఇటీవలే పాండిచ్చేరి నుంచి వచ్చిన నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశారు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగచైతన్య. 
 
Naga Chaitanya, Chandu Mondeti and Bunny Vas with the villagers
Naga Chaitanya, Chandu Mondeti and Bunny Vas with the villagers
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. #NC23 అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు.
 
#NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్ నిన్న వైజాగ్‌ వెళ్ళారు.  ఈరోజు శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం  గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు.  
 
ఈ సందర్భంగా మీడియాతో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ''ఆరు నెలల క్రితం చందూ కథను చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు. కథ చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. మత్స్యకారుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాం. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ రోజు మొదలౌతున్నాయి' అని అన్నారు.
 
చందూ మొండేటి మాట్లాడుతూ, “ ఇక్కడ స్థానికుడు కార్తీక్ 2018లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు. మొదట అరవింద్‌గారికి, బన్నీ వాస్‌గారికి కథ చెప్పాడు. కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. గత రెండేళ్లుగా స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధంగా వుంది. చాలా బాగా వచ్చింది. నాగచైతన్య గారు ఈ కథ పట్ల చాలా అనందంగా వున్నారు. సంఘటన జరిగిన చోటే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాలనుకున్నాం’’ అన్నారు
 
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ''మా వర్క్ ఇప్పుడే మొదలైంది. 2018లో ఒక సంఘటన జరిగింది. గ్రామంలోని స్థానికులు ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లి అక్కడ ఫిషింగ్ బోట్లలో పని చేస్తున్నారు. 2018లో జరిగిన ఈ సంఘటన ఆధారంగా రైటర్ కార్తీక్ కథను డెవలప్ చేశారు. చందూ దానిని అందమైన ప్రేమకథగా రూపొందించారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా కొత్తవరవడి వైపు వెళుతుంది. సహజసిద్ధంగా వుండే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. దర్శకుడు చందూ కూడా కథ జరిగిన మూలాల్లోకి వెళ్లాలనుకున్నారు. చైతన్య గారు కూడా మత్స్యకారులు,  వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఢిల్లీతో పాటు పాకిస్థాన్‌లోని కరాచీని కూడా మత్స్యలేశం ఊరు కదిపింది. అలాంటి వూరుని చూసి ఒక స్ఫూర్తిని పొందడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మాకు ఘన స్వాగతం లభించింది. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము మళ్లీ ఇక్కడకు రావచ్చు. గ్రామస్థుల నుంచి సహకారం అందుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
 
 ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.