ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఎన్టీఆర్ నామ స్మరణలో టాలీవుడ్ - నూటికో కోటికో ఒక్కరు...

ntr birthday celebrations
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్రపరిశ్రమ ఆయన నామ స్మరణలో మునిగిపోయింది. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పిస్తూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. ఈ మేరకు చిరంజీవి, ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడితోపాటు పలువురు సినీ ప్రముఖులు తాజాగా ట్వీట్స్‌ చేశారు.
 
'నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనసులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెబుతుంది. అలాంటి కారణజన్ములు నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన ఆయనతో నా అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..'.. మెగాస్టార్ చిరంజీవి
 
'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..!' హీరో జూనియర్ ఎన్టీఆర్ 
 
'తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, శక పురుషుడు, తెలుగువారి గుండెచప్పుడు అన్న నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులు' దర్శకుడు గోపీచంద్‌ మలినేని
 
'ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారక రామారావు. గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనసు ఉన్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనికివే నా ఘన నివాళి' దర్శకుడు అనిల్‌ రావిపూడి
 
'తెలుగు జాతి.. తెలుగు సినిమా.. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిన మిమ్మల్ని స్మరించుకుంటూ.. జోహార్ ఎన్టీఆర్' దర్శకుడు హరీశ్ శంకర్‌
 
'ఆ రూపం.. ఆ అభినయం.. అనితరసాధ్యం.. తెలుగువారి ఆత్మగౌరవ తేజం. నా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావు దివ్యస్మృతికి నమస్సుమాంజలి' రచయిత రామజోగయ్య శాస్త్రి