రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీన థియేటర్లు బంద్ చేయాలనుకోవడం మొదట అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమకు అన్యాయం జరుగుతుందనీ, అందుకే థియేటర్లో పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకురావాలని కొంతమంది ఎగ్జిబిటర్లు ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్లో సమావేశం అయి తీర్మానించారు. దానికి ప్రస్తుత ఛాంబర్ కమిటీ కూడా తందానా అనేసింది. దీనిపై రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఫైనల్ గా పవన్ కళ్యాణ్ సినిమా హరిహరవీరమల్లు, కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టడంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఫిలింఛాంబర్ పెద్దలు ఓ ప్రముఖ హీరో సినిమా రిలీజ్‌కు ఇలాంటివి ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టలేదు. అసలు ఈ బంద్ అనేది జరగదు. అంటూ మొసలి కన్నీరు కార్చారు. మరి మొదట్లోనే ఎందుకు ఎగ్జిబిటర్లను అడగలేదని విమర్శ కూడా వారిని పట్టిపీడిస్తుంది.
అసలు ఈ బంద్‌కు పిలుపు ఇవ్వడం వెనుక పెద్ద స్కామ్ దాగివుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మొత్తం దాదాపు అసలు థియేటర్ ఓనర్ల అయిన అసలు ఎగ్జిబిటర్ల చేతుల్లో లేవు. కనీస సౌకర్యాలు లేవనే సాకుతో తెలుగు రంగంలోని బడా నిర్మాతలు వాటిని లీజుకు కొంతకాలం క్రితమే తీసేసుకున్నారు. అందులో దిల్ రాజు, డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి ప్రముఖుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వారంతా కలిసి థియేటర్ల బంద్ అనేది క్రియేట్ చేశారనేది జగమెరిగిన సత్యం.
కానీ పవన్ కళ్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు సినిమా పరిశ్రమకు థ్యాంక్స్ చెబుతూ, ఇండస్ట్రీ సమస్యలకోసం అందరూ కలిసి రండి అంటూ పిలుపు ఇచ్చారు. ఈ పిలుపుకు భయపడో, మరో రాజకీయ కారణమేమో తెలీదుకానీ, అల్లు అరవింద్ వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించి, నేను ఆ నలుగురిలో లేను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
అద్దె, పర్సెంటేజ్ విధానం అంటే ఏమిటి?
ఇప్పుడు థియేటర్లు అద్దె విధానంలో నడుస్తున్నాయి. ఏ సినిమా ఆడినా అద్దె బేస్ తోనే రన్ కావడంతో దానికి ఎగ్జిబిటర్ బాగుపడతాడు. స్టాఫ్‌కు జీతాలు ఇవ్వగలడు. హిట్ సినిమా అయితే తమ స్టాఫ్‌కు బోనస్ కూడా ఇవ్వగలడు. వాటి వల్ల నిర్మాతలకు ఒరిగేది ఏమీలేదు. అందుకే దానికి చెక్ పెట్టడానికి పర్సెంటేజ్ విధానం కావాలని ఇప్పుడు నిర్మాతలు, పంపిణీదారులు పట్టుపడుతున్నారు. ఈ ప్రక్రియ కొత్తదేమీకాదు. గతంలోనూ పెట్టిందే.
అయితే జగన్ ప్రభుత్వం హయాంలో కిక్కురుమనని నిర్మాతలు, పంపిణీదారులు కూటమి ప్రభుత్వం రాగానే గళం విప్పారు. మొన్న జరిగిన నిర్మాతలు, పంపిణీదారుల మీటింగ్‌లో పట్టుమనీ 100 మందికూడా హాజరుకాలేదు. దాదాపు 90 శాతం థియేటర్ యాజమాన్యాలు పర్సెంటేజ్‌కు వ్యతిరేకించాయి.
జగన్ ప్రభుత్వంలో అప్పట్లోనే ఇంచుమించు నిర్మాతల సమస్యలంటూ ఇలాంటి పరిస్థితి వస్తే, నా సినిమా వరకు మీరు థియేటర్లో ప్రదర్శించవద్దు. కానీ ఇతర సినిమాలను ఆపవద్దని స్టేట్ మెంట్ ఇచ్చిన ఏకైక హీరో పవన్ మాత్రమే. ఇప్పుడు అలాంటి పవన్ డిప్యూటీ సిఎంగా వుండగానే, ఆయన్ను బేఖాతరు చేసేలా నిర్మాతలు, పంపిణీదారులు బంద్ అనే కీలక నిర్ణయాన్ని తీసుకోవడం దుస్సాహసమే అవుతుంది.
బంద్ వెనుక చాలా కుట్ర దాగి వుంది. ఇవేవీ తెలీని కార్మికుల పార్టీ అని పేరు చెప్పుకునే ఓ పార్టీ నాయకుడు, పవన్ మాటలు బెదిరిస్తున్నట్లుగా వుందంటూ, ఆయన నైజం మార్చుకోావాలంటూ చేసిన స్టేట్మెంట్ అపహాస్యానికి గురిచేశాయి. అలాంటి నాయకులు వుండబట్టే పార్టీ నాశనం అయిందంటూ ఫిలింఛాంబర్ పెద్దలే విమర్శిస్తున్నారు.
కాగా, థియేటర్ల బంద్ అనేది ఆ నలుగురికీ భస్మాసుర అస్త్రంగా మారింది. అందుకే పవన్ కళ్యాణ్‌కి తిక్క రేగింది.. తనలోని గబ్బర్ సింగ్ బయటకి వచ్చాడు.. లెక్కలన్నీ బయటకి లాగుతున్నాడు. నిజంగా చిత్రసీమని బతికించాలంటే నిర్మాతలు చెయ్యాల్సింది ఏమిటి? జనాలు థియేటర్లకు రావాలంటే అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? అనేది రేపు ఇండస్ట్రీ కలిసివస్తే తాను చెబుతానని అన్యాపదేశంగా పవన్ వెల్లడించారు.
అసలు థియేటర్లు పర్సెంటేజీ వల్ల లాభ పడేది కేవలం నిర్మాతలు, పంపిణీదారులే. హిట్ సినిమా టికెట్ 100 రూపాయిలు అయితే అందులో అగ్ర భాగం నిర్మాతకూ, పంపిణీదారుడికి చేరుతుంది. ఎగ్జిబిటర్‌కు పెద్దగా దక్కదు. ఒరిజినల్ ఎగ్జిబిటర్ అనేవాడు లేడు కాబట్టి లీజ్ తీసుకున్న నిర్మాతలకే ఆ లాభం వస్తుంది. అయితే ప్లాప్ సినిమా విషయంలోనూ నష్టాన్ని భరించేందుకు నిర్మాతకు, పంపిణీదారుడు ముందుకురాడు. అందుకే వారికి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ చేసిన కొత్త ఎత్తుగడ వేశారని సినీ మంత్రిత్వశాఖ చెబుతోంది.
ఇప్పుడు సినిమా రంగం అంతా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓటీటీ సంస్థలు డేట్ ఫిక్స్ చేస్తేనే థియేటర్లో సినిమా వేయాలి. లేదంటే బాక్స్ బయటకు రాదు. దీనిపై చాలామంది నిర్మాతలు విసిగి ఓన్ గా రిలీజ్ చేసుకుని ఇబ్బందులు, నష్టాలు కూడా చవిచూశారు. ఇటీవలే విడుదలైన సన్నాఫ్ వైజయంతీ సినిమా కూడా అలాంటిదే. పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఆ నలుగురు మినహా మిగిలిన అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రైమూవీస్, సితార ఎంటర్టైన్మెంట్, వైజయంతి మూవీస్ వంటివారు ఎవ్వరూ అడగలేదు. ఆ నలుగురి నిర్ణయాలను వారంతా గతంలో వ్యతిరేకించారు.
అందుకే పవన్ కళ్యాణ్ ఓ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. దాని వల్ల ఎగ్జిబిటర్లు, కార్మికులకు న్యాయం జరిగేలా వుంటుందనీ, నిర్మాతలు, పంపిణీదారుల కుట్రలకు చెక్ పెట్టనున్నారని ట్రేడ్ వర్గాలు నివేదిస్తున్నాయి.
పనిలో పనిగా ఓటీటీ కబంధహస్తాలలో నిర్మాతలు కూరుకుపోకుండా ప్రభుత్వాలే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ట్రేడ్ వర్గాలు కోరుతున్నాయి.