గాయకుడిగా మరోసారి మురిపించనున్న పవన్‌కళ్యాణ్
కథానాయకులు గాయకులుగా మారడం తెలిసిందే. తమ సినిమాలలో ప్రత్యేకంగా ఓ పాటను పాడి అభిమానులను అలరిస్తుంటారు. నటనతోపాటు ఏదైనా ప్రత్యేకంగా వుండాలని సంగీత దర్శకులు కోరుకుంటారు. ఆ సందర్భంలో ఏదోచోట పాటను చొప్పించి సందర్భానుసారంగా పాడించేస్తారు. గబ్బర్ సింగ్‌లో కోట శ్రీనివాసరావు పాట కూడా అటువంటిదే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు కొన్ని పాటలు పాడారు. తనే దర్శకత్వం వహించిన `జానీ` సినిమాలో `ఎం.ఎస్. నారాయణ తాగుబోతుగా తాగందే వుండలేడనే సందర్భంలో సారా తాగడం మానురోయ్ లేదంటే సచ్చి ఊరుకుంటావురోయ్` అంటూ తనదైన శైలిలో పాడి మెప్పించాడు పవన్ కళ్యాణ్.
ఆ తర్వాత `అత్తారింటికిదారేది` సినిమాలోనూ `కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..` అంటూ హైపీచ్‌లో పాడి ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు కొత్తగా ఆయన చేబోతున్న `అయ్యప్పన్ కోషియమ్` రీమేక్‌లో నూ ఓ పాటను పాడనున్నాడు. ఇది జానపదశైలిలో అందరినీ ఆకట్టుకునేలా జానపద గీతాన్ని తీసుకుని అదే తరహాలో పాడబోతున్నాడు. ఇందుకు సంబంధించిన జానపద గాయకులను అనుకరిస్తున్నారు. ఇప్పటికే ఆ గాయకులను థమన్ స్టూడియోకు పిలిపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు ఇదో కొత్త ప్రయోగం అని చెబుతున్నాడు. ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమా కొద్ది భాగం ఆమధ్య షూటింగ్ కూడా చేశారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.