శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (18:12 IST)

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాకు వి.వి. వినాయ‌క్‌!

VV Vinayak
ద‌ర్శ‌కుడిగా యాక్ష‌న్ సినిమాల‌కు త‌న‌కంటూ ఓ పేరును తెచ్చుకున్న వ్య‌క్తి వి.వి. వినాయ‌క్‌. ఆయ‌న సినిమాలంటే సుమోలు, బాంబ్ బ్లాస్ట్‌లు వుండేవి. ఎన్‌.టి.ఆర్‌.తో `ఆది` సినిమానుంచి చూస్తున్న‌వే. ఆ త‌ర్వాత మెగాస్టార్‌తోనూ ఠాగూర్ సినిమా చేశాడు. అందులో ఆయ‌న ఓ కేరెక్ట‌ర్‌ను కూడా పోషించాడు. అలా న‌టుడిగా చిన్న పాత్ర‌లు వేస్తూ ఏకంగా హీరోగా మారేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అందుకు ఆయ‌న కేశాలంక‌ర‌ణ‌, దేహాన్ని కూడా మార్చుకున్నాడు. కాస్త లావుగా అనిపించే వినాయ‌క్ హీరోగా చేస్తుండ‌డంతో స‌న్న బ‌డ్డాడు. `శీన‌య్య‌` పేరుతో ఆ సినిమా షూటింగ్ కొంత భాగం జ‌రిగింది. క‌రోనా వ‌ల్ల అది కాస్త ఆగిపోయింది.
 
ఇక ద‌ర్శ‌కుడిగా నైనా చేయాల‌ని బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌తో బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. రాజ‌మౌళి చేసిన `ఛ‌త్ర‌ప‌తి`ని రీమేక్ చేస్తున్నాడు. అందుకోసం జూబ్లీహిల్స్‌లోని రంగ‌స్థ‌లం సెట్ వ‌ద్ద వేసిన భారీ సెట్ ఇటీవ‌ల గాలివాన‌కు ప‌డిపోయింది. దాంతో బ్రేక్ ప‌డింది. మ‌ర‌లా త‌న‌లోని న‌టుడిని మ‌రోసారి నిరూపించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్ అనే మ‌ల‌యాళ రీమేక్ అది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. లాక్‌డౌన్ స‌డ‌లించారు కాబ‌ట్టి త్వ‌ర‌లో ఆయ‌న‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. కోలీవుడ్‌లో ద‌ర్శ‌కులు న‌టులుగా మ‌రాడం తెలిసిందే. ఇప్పుడు విన‌యాక్ ఆ రూటులోనే వున్నాడు. ఒక‌ప్పుడు అన్న‌య్య‌తో సినిమా చేస్తే ఈసారి త‌మ్ముడుతో వినాయ‌క్ సినిమా చేస్తున్నాడు.